వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఎవర్నీ నమ్మలేని స్థితికి వెళ్లిపోతోంది. తాజాగా ఆయన జగన్ పై మండిపడినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీనికి కారణం కడప కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లడమే. వెళ్లిన కొంత మంది కాదు మరికొంత మంది కూడా వెళ్తున్నారని కడప మేయర్ సీటు టీడీపీ ఖాతాలో పడుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమాచారం జగన్ కు చేరిందేమో కానీ ఆయన అవినాష్ రెడ్డిపై మండిపడినట్లుగా చెబుతున్నారు.
కడపలో కార్పొరేటర్లు ఎవరూ బయట వ్యక్తులు కాదు. అందరూ అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగేవారే. జనంలో నుంచి వచ్చిన వారు ఒక్కరూ లేరు. అయినా వారిలో కొంత మంది తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఎవరూ ఊహించలేకపోతున్నారు. అవినాష్ రెడ్డికి తెలియకుండా జరగదన్న సమాచారం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. కడపలో టీడీపీలో చేరికల్ని చూస్తూ ఎలా ఉన్నావని ఆయనపై మండిపడినట్లుగా చెబుతున్నారు.
ఇక ఎవరూ మారకుండా చూస్తానని అందరితో మాట్లాడతానని అవినాష్ రెడ్డి చెప్పినట్లుగా .. వైసీపీ వర్గాలంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులోనే.. తాడేపల్లిలోనే రిలాక్స్ అవుతారని లోకల్ లో రాజకీయం చేయాల్సింది తామేనని.. పట్టువిడుపులు తప్పదని అవినాష్ వర్గం నిట్టూరుస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే కార్పొరేటర్లను అవినాష్ రెడ్డి టీడీపీలోకి పంపుతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జగన్ అభిప్రాయం కూడా అదేనని అందుకే హెచ్చరించారని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు పార్టీ మారినా అది అవినాష్ రెడ్డి ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.