అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 5రోజుల రైతు భరోసా యాత్ర నిన్నటితో ముగిసింది. గతంలో నాలుగు సార్లు భరోసా యాత్రలు చేసినా ఆయన ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయారు. కానీ ఈసారి యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో, తెదేపా మంత్రులు, నేతలు అందరూ ఆయన విరుచుకు పడటం, తెదేపా శ్రేణులు నిరసనలు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించడం,జగన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం వంటి కార్యక్రమాల వలన భరోసా యాత్రకి స్వయంగా తెదేపాయే ఉచిత ప్రచారం చేసినట్లయింది. దానితో యావత్ మీడియా, ప్రజల దృష్టిని జగన్ ఆకర్షించగలిగారు. బహుశః జగన్ కూడా అదే కోరుకొంటున్నారేమో?
జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఉద్దేశ్యం ఒకటైతే జరుగుతున్నది వేరొకటి. ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన రైతుల కుటుంబాలను ఓదార్చి వారికి వైకాపా అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వడం ఆయన యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. కానీ, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఆయనని చెప్పులతో కొట్టాలని…తెదేపా నేతలకు చెప్పులతో కొట్టడం నచ్చడం లేదు కనుక చీపుళ్ళతో కొట్టాలంటూ మాట్లాడి తెదేపాను రెచ్చగొట్టడంతో ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు, కార్యకర్తల మధ్య ఘర్షణలు, పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేసుకోవడం జరుగుతున్నాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం చేపట్టి భరోసా యాత్ర వలన ఆ ప్రయోజనం నేరవేరలేరదు కానీ, అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ యుద్ధం చేసుకొంటున్నాయి.
జగన్ భరోసా యాత్రలు చేపట్టినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ వాటి వలన వైకాపాకి ప్రయోజనం కలిగినట్లు జగన్మోహన్ రెడ్డి భావిస్తే, త్వరలోనే మరిన్ని భరోసా యాత్రలు చేపట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ యుద్ధంలో ఆ రెండు పార్టీలలో ఏదో ఒకటి చివరికి పైచెయ్యి సాధించవచ్చు కానీ నిరుపేద రైతులు మాత్రం ఘోరంగా ఓడిపోయారని చెప్పక తప్పదు. వారిని ప్రభుత్వమూ పట్టించుకోదు.. జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోరు.