హైదరాబాద్: అక్రమ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితర 19మంది నిందితులు వచ్చేనెల 28న కోర్ట్ ముందు హాజరవ్వాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ 19 మందిలో ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, అరబిందో ఛైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, ఎండీ నిత్యానందరెడ్డి, ఆయన భార్య రాజేశ్వరి, సోదరుడు ప్రసాదరెడ్డి, హెటరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ట్రైడెంట్ మాజీ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ఏపీఐఐసీ రిటైర్డ్ జీఎమ్ వైవీఎల్ ప్రసాద్, అరబందో మాజీ సీఎస్ చంద్రమౌళి ఉన్నారు.
వైఎస్ హయాంలో అరబిందో, హెటరో సంస్థలకు మహబూబ్‌నగర్ జడ్చర్ల సెజ్‌లో 150 ఎకరాల భూమిని కేటాయించటంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎకరం భూమి రు.15 లక్షల చొప్పున కేటాయించాల్సి ఉండగా, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకుగానూ కేవలం రు.7 లక్షల చొప్పున కేటాయించినట్లు సీబీఐ ఛార్జిషీట్లో అభియోగం మోపింది. ఈ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ సంస్థ మనీల్యాండరింగ్ కింద కేసు నమోదు చేసి పై నిందితులు నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే జగన్‌కు ఇప్పుడు ఈడీ నుంచి సమన్లు జారీ అవ్వటంపై వైసీపీకి అనుకూలంగా ఉంటుందని పేరుగాంచిన ఒక ప్రముఖ వెబ్సైట్ ఒక వెరైటీ కథనాన్ని ఇచ్చింది. జగన్ కేసులు అన్నీ దాదాపుగా నీరుగారిపోతున్నాయని, అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈడీ కోర్టునుంచి సమన్లు రావటం వెనక చంద్రబాబు ఉన్నాడని రాసింది. కోర్టు విచారణకు హాజరు అవ్వమని సమన్లు ఇచ్చినది “ఈడీ కోర్టు” అయితే ఆ స్వామిభక్తి వెబ్ సైటులో “ఈడీ సమన్లు” అని రాయడం వింతగా,విషయ పరిజ్ఞానం లేని వారి రాతలుగా ఉంది. జగన్‌ను ఈడీ పేరుతో మానసికంగా దెబ్బకొడితే వైసీపీ వీక్ అవుతుందని, అప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవుతుందని భావిస్తూ చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమన్లు జారీ చేయించారని పేర్కొంది. ఈడీనుంచి జగన్ ఎలా బయటపడతారు, అసలు జగన్ అక్రమ ఆస్తుల కేసు ఎన్నాళ్ళు సాగుతుంది, జగన్‌కు సమన్లు ఏపీలో అధికార పార్టీకి ఎలా కలిసొస్తుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందేనంటూ రాసుకొచ్చింది. అంతా బాగానే ఉందిగానీ, జగన్ కేసులు నీరుగారిపోతున్నాయని పేర్కొనటం ఏమిటో అర్థంకావటంలేదు. జగన్‌పై ఉన్న కేసులు నీరుగారిపోతాయనటానికి ప్రాతిపదిక ఏమిటో వివరంగా చెప్తే బాగుండేది. ఒకవేళ బీజేపీతో వైసీపీ పొత్తు ఏమైనా పెట్టుకుని ఉంటే నీరుగారిపోతున్నాయని రాసినా అర్థముంటుంది. అలాంటిదేమీ లేకుండానే, నిందితులందరికీ బెయిల్ వచ్చినంత మాత్రాన నీరుగారిపోయినట్లేనని అనుకుంటే ఎలా?