కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చేసిన ప్రసంగమే, కాస్త అటుఇటుగా ఇక్కడా జగన్ చేశారు. నంద్యాలలో ఇచ్చిన హామీలనే కాకినాడకి కూడా ఇచ్చేశారు! మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనీ, ఆ తరువాత రాబోతున్నది మన ప్రభుత్వమే అనీ, ఆ తరువాత కాకినాడను అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని జగన్ చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలకు గుణపాఠం చెప్పాలంటే, ఈ మూడున్నరేళ్ల పాలనను చూసి టీడీపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ఓటర్లను కోరారు. కాకినాడను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తనకు విడిచిపెట్టాలన్నారు! చంద్రబాబుకు ఓటెయ్యడమంటే, మునిగిపోతున్న పడవ ఎక్కినట్టే అన్నారు.
వైకాపా అధికారంలోకి వస్తే నవరత్న హామీలు ప్రజలందరికీ అందిలే చూస్తాననీ, రాష్ట్ర ప్రజలకు అండదండగా ఉంటానని జగన్ చెప్పారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసిందేం లేదనీ, కంచాలు మోగిస్తూ నిరసన తెలిపితే కేసులు పెట్టించారని ఆరోపించారు. ఓటు నోటు కేసులో దొరికిపోయినా చంద్రబాబుపై కేసులు ఉండవనీ, గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించినా ఆయనపై ఎలాంటి కేసులు నమోదు కావని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారనీ, కానీ ఇప్పటివరకూ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనీ, మాటలు చెప్పి మోసం చేయడం మాత్రమే ఆయనకి తెలిసిన విద్య అని జగన్ మండిపడ్డారు. ఈ పరిపాలన మాకొద్దు అని ప్రజలు విసుగు చెందేలా చంద్రబాబు సర్కారు పనితీరు ఉంటోందనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ఇలా జగన్ ప్రసంగమంతా చంద్రబాబుపై విమర్శలకే సరిపోయిందని చెప్పొచ్చు!
నంద్యాల ఎన్నికతోపాటు కాకినాడ కార్పొరేషన్ కూడా వచ్చే ఎన్నికలకు నాంది అని జగన్ చెప్పడం గమనార్హం! నంద్యాలలో చెప్పినట్టుగానే… కాకినాడ అభివృద్ధిని తనకు వదిలేయాలని అన్నారు. నంద్యాలలో చెప్పినట్టుగానే వచ్చే ఏడాదిలో ఎన్నికలు వస్తాయనీ, అధికారంలోకి రాబోతున్నది మన ప్రభుత్వమే అన్నారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టుగా… అసెంబ్లీ ఎన్నిక అయినా, స్థానిక సంస్థలు ఎన్నికలైనా జగన్ దగ్గరున్నది ఒకే ప్రసంగ పాఠం ఉన్నట్టుగా ఉంది! చంద్రబాబు నాయుడు మూడున్నరేళ్ల పాలనపై తీర్పు ఇవ్వాలని అసెంబ్లీ ఎన్నికల్లో కోరడం అర్థవంతంగా ఉంటుంది. నంద్యాల వరకూ ఈ వాదన, ఈ ప్రచారం అర్థవంతమైందే. అంతేగానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే ప్రాతిపదిక తీర్పు ఇమ్మని కోరడం ఎంతవరకూ సరైంది..? స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటెయ్యాలనుకునేవారు కూడా రాష్ట్ర స్థాయి సమస్యలపైనా, లేదా ఇతర జిల్లాల్లో ప్రభుత్వం లేదా ప్రతిపక్షం పనితీరును గుర్తించి ఓట్లెయ్యమంటే ఎలా..?