అసెంబ్లీ మొదలైంది. సభ్యులుగా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణం చేసి, ఓ రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టి… పులివెందులలో పర్యటించి, బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్నారు.
ఇప్పుడు గుర్తుకొచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్ కు… ప్రతిపక్షహోదా. ప్రతిపక్ష నాయకుడి హోదా.
అవును… గత ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం సాధించిన వైసీపీకి, 5 ఏళ్ల పాలన తర్వాత జనం ఛీకొట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. కూటమికి ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చారు. సాధారణంగా మొత్తం సీట్లలో కనీసం 10వంతు సాధించే విపక్షానికి ప్రతిపక్ష హోదా, వారి నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది. సభలో సభా నాయకుడిగా ఉన్న సీఎం తర్వాత ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతటి గౌరవ మర్యాదలు లభిస్తాయి.
కానీ, ఈసారి వైసీపీకి పదోవంతు కూడా రాలేదు కాబట్టి… ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా రాలేదు. ఆ విషయం వైసీపీకి కూడా తెలుసు కాబట్టే, చడీచప్పుడు లేకుండా ప్రమాణస్వీకారం చేసి వెళ్లారు. కానీ, ఈరోజు తమకు ప్రతిపక్ష హోదా ఉంటుందని స్పీకర్ కు బహిరంగ లేఖ రాయటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
జగన్ కు అభ్యంతరం ఉంటే ప్రమాణస్వీకారం చేసే రోజే సీఎం తర్వాత తనకు అవకాశం ఇవ్వాలని కోరాల్సింది. కానీ కోరలేదు… తీరా బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న సమయంలో ఎందుకు గుర్తుకొచ్చింది అంటూ పెదవి విరుస్తున్నారు. పైగా లేఖలో జగన్ ఈ పద్ధతి ఎక్కడా పాటించలేదని చెప్పుకొచ్చారు. కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత 60సీట్లు కూడా దక్కించుకోలేదు. దీంతో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి అవకాశం కాంగ్రెస్ కు దక్కలేదు. కానీ, రాజ్యసభలో 10వంతు స్ట్రెంత్ ఉంది కాబట్టి మల్లిఖార్జున ఖర్గేకు అంతకు ముందు గులాంనబీ ఆజాద్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు.
కానీ, ఇవన్నీ పక్కనపెట్టి జగన్ వాదిస్తున్న తీరు… స్పీకర్ పైనే విమర్శలు చేస్తూ, స్పీకర్ నే అడగటం చూస్తుంటే జగన్ ఓటమి బాధ నుండి బయటపడ్డట్లు లేదు అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.