తెలుగుదేశం పార్టీ సెల్ఫీ చాలెంజ్‌లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని చిరాకు పుట్టిస్తున్నట్లుగా ఉన్నాయి. అసలు టీడీపీ నేతలు .. ముఖ్యంగా చంద్రబాబు టిడ్కో ఇళ్ల ముందు దిగినవి ఫేక్ ఫోటోలట. ఈ విషయాన్ని మార్కాపురంలో ఈబీసీ నేస్తం పథకానికి మీట నొక్కి… గట్టిగా అరిచి చెప్పారు అసలు సెల్ఫీ అంటే ఏమిటో కూడా ఆయన అదే వేదికపై నుంచి వివరించారు. “సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతి ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి. ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని మంచి సెల్ఫీ అంటారు..” అంటారని చెప్పుకొచ్చారు. ,
తాము అధికారంలోకి వచ్చాక, ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా సొమ్ము డీబీటీ విధానం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశామని గుర్తు చేశారు. మరి చంద్రబాబు హాయాంలో ఆ డబ్బు అంతా ఏమైందో అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు హయాంలో ఇన్ని పన్నులు, ఇన్ని అప్పులు లేవనే సంగతిని మాత్రం దాచేశారు. దాదాపుగా నాలుగేళ్ల కాలంలోనే ఐదు లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. వాటిలో రెండు లక్షల కోట్లను ప్రజలకు పంపిణీ చేశారంటున్నారు. మరి మడు లక్షల కోట్లు ఏమయ్యాయని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు లక్షల కోట్లతో పోలవరం పూర్తి చేయవచ్చు.. అమరావతిని కూడా పూర్తి చేయవచ్చునని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి తాను అభివృద్ధి చేశానని చెప్పుకోలేకపోతున్నారు. డబ్బులు బటన్ నొక్కడమే పెద్ద సంక్షేమం అనుకుంటున్నారు. కానీ ఇటీవలి కాలంలో బటన్ నొక్కడమే కానీ లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదు. సగం మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బటన్ నొక్కడానికి మాత్రం ఆయన కోట్లు ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. అధికారిక సభల్లో రాజకీయ విమర్శలు చేస్తున్నారు.