నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఎక్కడ.. ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదంటున్న జగన్ ఎక్కడ ?. మొదటిది ఏడాదిన్నర కిందట.. రెండోది పోలింగ్ కు వారం రోజుల ముందట. ఆదివారం విశ్రాంతి తీసుకుని సోమవారం మూడు ప్రచారసభల్లో జగన్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగాలు పూర్తిగా ఓటములకు కారణాలు చెబుతున్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆయన చెబుతున్నారు. ఎందుకు అంటే అధికారుల్ని ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారట. తాను వేయాలనుకున్న డబ్బుల్ని వేయనివ్వకుండా చేస్తున్నారట.
ఆ అధికారులు ఉంటే ఎన్నికలు సరిగ్గా జరగవనే మార్చేస్తున్నారు. జగన్ రెడ్డి చేయాలనుకున్న అరాచకాలను ఆపడానికే చేస్తున్నారు. అప్పుడే బాగా ఎన్నికలు జరుగుతాయి. కానీ తాను అనుకున్నట్లుగా జరగవని ఓడిపోతానని జగన్ రెడ్డి భయపడుతున్నారు. డబ్బులు అకౌంట్లలో వేయనివ్వడం లేదని ఆయన చెబుతున్నారు. ఆ బటన్లు నొక్కి రెండు, మూడు నెలలు అవుతోంది. అప్పుడు వేయకుండా… పోలింగ్ ముందు రోజు అకౌంట్లలో వేస్తానంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు ?. ఆ మాత్రం తెలివి తేటలు జగన్ రెడ్డికేనా ఉండేది ?
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నా.. ఈసీ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ నేతలు.. వివేకా హత్య దర్యాప్తు చేస్తున్న ఎస్పీని కూడా మార్పించేశారు. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ ను కూడా మార్పించి పూర్తిగా అనధికారికంగా పాలనను చేతుల్లోకి తీసుకున్నారు. డీజీపీ సవాంగ్ పోలింగ్ కు.. కౌంటింగ్ కు మధ్య ఉన్న కాలం అంతా జగన్ కే రిపోర్టు చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా. చంద్రబాబు సీఎం అనే సంగతి కూడా పట్టించుకోలేదు. కానీ అప్పుడు మాత్రం.. జగన్ కు హాయిగా ఉంది.. ఇప్పుడు అరాచకాలు చేస్తున్న అధికారుల్ని మారిస్తే మాత్రం గగ్గోలు పెడుతున్నారు.
ఎలా చూసినా జగన్ పతనం రోజు రోజుకు చాలా ఎక్కువగా ఉంది. వచ్చే వారం రోజుల్లో ఇది ఏ స్థాయికి వెళ్తుందో చెప్పలేము కానీ… ఫలితాలను గుర్తు చేసుకుని జగన్ ఇప్పటికే ఆందోళన చెందడం ప్రారంభించారు.