టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరకుండా ఉండేందుకు జగన్ రెడ్డి ఆఖరి రాగం పాడేశారని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రితో జరిగిన భేటీలో ఆయన .. తాను నమ్మకమైన మిత్రుడినని కోరుకుంటే.. వెంటనే ఎన్డీఏలో చేరిపోతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ అంశంపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయనట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ చాలా బిజీగా ఉన్నారు. అందుకే జగన్ రెడ్డితో పది నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఎక్కువ సమయం వెయిటింగ్ కే సరిపోయింది.
ఎన్డీఏలో చేరికపై జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై బీజేపీకి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా… తదుపరి అమిత్ షాతో చర్చలు నిర్వహించి ఉండేవారని అనుకుంటున్నారు. అయితే అమిత్ షా జగన్ రెడ్డిని కలవలేదు. ఆయన పార్లమెంట్ లోనే ఉన్నప్పటికీ సమయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. అంటే ఈ ప్రతిపాదనపై బీజేపీ సుముఖంగా లేదని చెబుున్నారు. జగన్ రెడ్డి చివరి అస్త్రంగా ఎన్డీఏలో చేరికపై ఆఫర్ ఇచ్చినా బీజేపీ స్పందించకపోవడం వైసీపీ వర్గాలకు షాక్ కు గురి చేసింది. లోక్ సభ సీట్లు ఎన్ని వచ్చినా రాకపోయినా.. రాజ్యసభలో తమకు పన్నెండు మంది సభ్యుల బలం ఉంటుందని దాన్ని చూసైనా … బీజేపీ ఫ్రెండ్లీగా ఉంటుందని అనుకుంటున్నామని వైసీపీ నేతలనుకున్నారు.
ఏపీలో పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెబుతున్నారు. జగన్ రెడ్డి సహకరించిన దానికి ప్రతిఫలంగా తాము కూడా చాలా వరకూ సహకరించామని.. ప్రతీ నిర్వాకంలోనూ భాగం పంచుకోలేమన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉందని అంటున్నారు . జగన్ రెడ్డి ఎన్డీఏలో చేరడం వల్ల మైనస్సే కానీ.. ప్లస్ ఉండదని అంచనాకు వచ్చి ఆయన ప్రతిపాదనను పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.