ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన భార్య భారతిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా మంత్రులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి జగన్ ఫీలయ్యారు. కేబినెట్ భేటీ తర్వాత ఆయన సహచరులతో రాజకీయాలు మాట్లాడారు. ఇటీవలి కాలంలో విపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రులు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వడం లేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు విమర్శలు ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. లేదంటే మరోసారి మంత్రులను మార్చాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాన్నే ప్రధానంగా జగన్ ప్రస్తావించారు. ఈ స్కాంలో భారతీ రెడ్డి హస్తముందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనికి వైసీపీ మార్క్ కౌంటర్ వచ్చింది. పోతుల సునీత లాంటి వాళ్లు.. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను బండబూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఇలాంటి ప్రెస్మీట్లు వినీ వినీ బోర్ కొట్టేసిందేమో కానీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు.పైగా మాట్లాడాల్సిన మిహళా మంత్రులు రోజా, అనిత, రజనీ లాంటి వాళ్లు పెద్దగా స్పందించలేదు. రోజా, అనిత విదేశీ టూర్లో ఉన్నారు. రోజా కేబినెట్ మీటింగ్ సమయానికి వచ్చారు. రజనీ అసలు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం లేదన్న ఆరోపణ చాలా కాలంగా ఉంది.
ఆమె సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటారు కానీ టీడీపీపై విమర్శలు చేయరని .. వైసీపీ నేతలే గొణుక్కుంటూ ఉంటారు. ఈ నేతల్ని దృష్టిలో పెట్టుకునే మారకపోతే మార్చేస్తానని జగన్ హెచ్చరించినట్లుగా భావిస్తున్నారు. అయితే జగన్కు సంప్రదాయబద్దంగా కౌంటర్ ఇవ్వడమంటే నచ్చదని.. బూతులు తిడితే.. తమకు తర్వాత అదే పరిస్థితి వస్తుందని.. ఎందుకు భరించాలని ఎక్కువ మంది సైలెంట్ గా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.