ప్రతిపక్ష నేత జగన్ చుట్టూ కేసుల ఉచ్చును మరింతగా బిగించాలని తెలుగుదేశం కోరుకుంటుంది అనడంలో సందేహం లేదు! జగన్ కేసుల విషయమై వీలైనంత త్వరగా చర్యలు ఉండేలే కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నట్టు కూడా కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఎలాగైనా జగన్‌ను మరోసారి జైలుకు పంపాలన్నది ‘వారి’ కోరిక అని కొంతమంది అంటుంటారు. వచ్చే ఎన్నికలకు ముందే జగన్‌పై చర్యలు ఉంటే… ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్న కోరిక ఎవరికి ఉందో ఓపెన్ సీక్రెట్. జనవరిలోనే జగన్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈ నెల 20 నుచి 23వ తేదీ వరకూ జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది.
ఈడీ ప్రశ్నించినంత మాత్రాన ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే… జగన్‌పై ఉన్న కేసుల గురించి మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు చేసేందుకు ఇంకో అవకాశం తెలుగుదేశం పార్టీకి చిక్కినట్టే కదా. నిజానికి, జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించి ఎక్కా ఎలాంటి తీర్పులూ రాకపోయినా చేయాల్సిన ప్రచారాన్ని టీడీపీ చేసేస్తూనే ఉంది. తాజాగా మరో పరిణామాన్ని కూడా తెలుగుదేశం తమకు అనుకూలంగా, జగన్‌కు వ్యతిరేకంగా ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
సుప్రీం కోర్టులో ఉన్న ఓ కేసుకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ వచ్చాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటీషన్‌పై కదలిక వచ్చింది. నిజానికి, ఈ పిటీషన్ ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉంది. విచారణను మరింత వేగవంతం చేసి వెంటనే తీర్పు ఇవ్వాలంటూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీం స్పందించింది. ఈ కేసు విషయంలో త్వరలోనే తీర్పు ప్రకటిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పిటీషనర్‌కు హామీ ఇచ్చింది.
అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ చేసే అవకాశం కోల్పోతారన్నది పసుపు కల! ఎందుకంటే, ఇప్పటికే జగన్ చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. విచారణకు హాజరౌతున్నారు. ఒకవేళ ఆ పెద్ద నేరారోపణల జాబితాలో ఆర్థిక నేరాలు కూడా చేర్చితే, జగన్‌కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నది వారి ఆశ. మొత్తానికి, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారి అనర్హతపై సుప్రీం వెలువరించబోయే తీర్పు దేశరాజకీయాల్లో చాలా కీలకంగా మారబోతోంది. ఇది కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.