తెలుగుదేశం పార్టీలో చేరికల హడావుడి కనిపిస్తోంది. ప్రజల్లో పట్టు ఉన్న నేతలు వరుస పెట్టి.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. రాజకీయంగా పేరు ప్రతిష్టలున్న కుటుంబాలు, సుదీర్ఘంగా ప్రజాజీవితంలో ఉన్న వారు తెలుగుదేశం పార్టీనే ఆప్షన్‌గా ఎంచుకుంటూడటంతో.. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. వైసీపీ వెంటబడినా ఆ పార్టీ వైపు చూడటం లేదు.
ప్రజల్లో పట్టు ఉన్న నేతలంతా టీడీపీ గూటికే..!
కోట్ల, భూమా, గౌరు కుటుంబాలు.. ఒకే పార్టీలో ఉంటాయని.. ఎవరూ ఊహించలేదు. దీన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చేసి చూపించారు. మాజీ ఎమ్మెల్యేలు,నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు.. టీడీపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లాలో ఉగ్రనరసింహారెడ్డి, నెల్లూరు జిల్లాలో విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి వంటి వారు టీడీపీలో చేరుతామని ఇప్పటికే ప్రకటించారు. ఉత్తరాంధ్రలోనూ.. వరుసగా చేరికలు ఉండబోతున్నాయి. ఉత్తరాంధ్రలో దిగ్గజ నేతలుగా పేరు పడిన కొణతాల రామకృష్ణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆయన ఈ వారంలోనే టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. సబ్బంహరి చేరితే టీడీపీలో చేరుతానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన చేరిక కూడా ఈ వారంలోనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలోని మరో కీలక నేత దాడి వీరభద్రరావు కూడా గతంలోనే టీడీపీలో చేరాలనే ఆసక్తి కనబరిచారు. కానీ.. విశాఖ జిల్లా టీడీపీలో ఉన్న పరిస్థితులు కారణంగా.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
గెలిచే పార్టీ టీడీపీ అని ఫిక్సయ్యారా..?
గెలిచే పార్టీ అన్న భావన కల్పించడానికి.. ఈ చేరికలు బాగా ఉపయోగపడుతున్నాయి. ముందుగా.. ఈ రేసును వైసీపీ మొదలు పెట్టింది. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని హడావుడి చేసింది. కానీ వారంతా.. టిక్కెట్లు రాని వారన్న క్లారిటీ రావడం.. దిగ్గజాలన్న నేతలు.. వైసీపీ వైపు కనీసం చూడకపోతూండటంతో.. టీడీపీ దీన్ని పకడ్బందీగా ఉపయోగించుకుంటోంది. గెలిచే పార్టీ అన్న ఇమేజ్ నిలబెట్టుకుంటోంది. వారం రోజుల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు చేరారు. దాంతో.. టీడీపీ నేతలంతా.. వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని.. వైసీపీ గెలిచే పార్టీ కాబట్టి వస్తున్నారన్న ఫీలింగ్ కల్పించడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా.. వైసీపీలో నేతలు చేరుతున్నారు. లోటస్‌పాండ్‌లో ప్రతీ రోజూ..జగన్ కండువాలు కప్పే పని పెట్టుకుంటున్నారు. కానీ.. ఏ ఒక్క నేత కూడా ప్రజాబలం ఉన్నవారు కాకపోవడంతో.. రాజకీయ వర్గాలు పెదవి విరిస్తున్నాయి. ఇరవై ఏళ్ల కిందట రాజకీయాలు మానుకున్న దాసరి జైరమేష్, అసలు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని నార్నే శ్రీనివాసరావు , అలాగే ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ వంటి వాళ్లకు కండువాలు కప్పుతున్నారు. నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలుగా ఉన్న వారికి కూడా జగన్ స్వయంగా కండువా కప్పుతున్నారు కానీ..ఎవరూ పట్టించుకోవడం లేదు.
వైసీపీ ఆత్రం చూసి టీడీపీ నేతలు బేరమాడుతున్నారా..?
టీడీపీలో టిక్కెట్లు గ్యారంటీ లేని.. మరికొంత మంది నేతలు కూడా వైసీపీతో టచ్‌లో ఉన్నారు . అయితే వారిని చేర్చుకుంటే.. ఇప్పటికే ఉన్న వారికి ఇబ్బంది అవుతుందని.. వారు తిరుగుబాటు చేస్తే మొదటికే మోసం వస్తుందని… వైసీపీ నేతలు ఆగిపోతున్నారు. తోట త్రిమూర్తులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి వంటి వారు.. ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే చీరాలలో ఆమంచి చేరడంతో.. అక్కడ ఇప్పటి వరకు సమన్వయకర్తగా ఉన్న యడం బాలాజీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. రేపోమాపో ఆయన టీడీపీలోచేరనున్నారు. భీమిలిలో ఇప్పటి వరకూ పార్టీని కనిపెట్టుకుని ఇద్దరు సమన్వయకర్తలు ఎప్పుడు పార్టీ మారతారో అర్థం కావడం లేదు. దీంతో చేర్చుకున్న వారి బలం కన్నా.. ఇంత కాలం పార్టీ కోసం పని చేసిన వారు దూరమవడం వైసీపీకి నష్టంగా మారింది. గెలిచే పార్టీ అన్న ఫీలింగ్ కోసం.. ఇతరుల్ని చేర్చుకుందామంటే.. వారు గొంతెమ్మ కోరికలు కోరుతూండటంతో.. జగన్.. ఇప్పటికే చర్చలు జరిపిన వారిని కూడా… పక్కన పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం.. కీలక నేతల్నిచేర్చుకుంటూ ఉండటంతో… గెలిచే పార్టీ అనే ఇమేజ్ను పెంచుకుంటూ పోయే ప్రణాళిక అమలు చేస్తున్నారు.
మైండ్‌గేమ్‌లో ఎవరిది పైచేయి…?
టీడీపీలో చేరుతున్న దిగ్గజ నేతలందర్నీ… వైసీపీ ప్రత్యేకంగా సంప్రదించింది. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. అయినప్పటికీ.. ఆ నేతలెవరూ ఆ పార్టీ వైపు చూడలేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి అడిగిన సీట్లు ఇస్తామని.. వైసీపీ ఆఫర్ చేసినా.. ఆ కుటుంబం టీడీపీ వైపే మొగ్గు చూపింది. వైసీపీలో కాకినాడ టిక్కెట్ చలమలశెట్టి సునీల్ కు ఎప్పుడో ఖరారయింది. అయినా సరే ఆయన వద్దనుకుని టీడీపీలో చేరారు. ఇక కొణతాల రామకృష్ణను కూడా.. వైసీపీ నేతలు పార్టీలోకి రావాలని రాయబారం పంపారు. కానీ.. ఆ పార్టీలో ఆయనకు జరిగిన అవమానాలు గుర్తు చేసుకుని తిరస్కరించారు. ఈ నేతలందరూ.. గెలిచే పార్టీగా టీడీపీనే భావిస్తున్నారు. అందుకే… వైసీపీ పిలిచినా.. ఎన్నికలు నిధులు ఇస్తామన్నా… అడిగినా టిక్కెట్లు ఇస్తామన్నా.. ఆ పార్టీ వైపు చూడటం లేదు. కానీ.. టీడీపీలో టిక్కెట్లు డౌట్ అన్న వారు మాత్రం.. వచ్చి తమకు ఫలానా సీట్లు కావాలని బేరం పెడుతూండటంతో.. వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో గెలిచే పార్టీ అన్న ట్యాగ్ కోసం… మైండ్ గేమ్ కీలకంగా మారింది. ఇప్పుడు ఈ గేమ్‌లో టీడీపీ ముందు ఉంది.