కేసీఆర్ తో రాజకీయపరంగా ఎంతో అవగాహన ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏపీ హక్కుల్ని కాపాడటంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. కనీసం విద్యుత్ బకాయిల్ని ఇప్పించుకోలేక.. తెలంగాణకు మేలు జరిగేలా వ్యవహారాన్ని కోర్టులో పెట్టారు. అది ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలియదు. చంద్రబాబు హయాంలో ఏపీ ఆస్తులు, హక్కుల పరిరక్షణ కోసం ఓ యుద్ధం జరిగింది. అప్పటి గవర్నర్ నరసింహన్ పూర్తిగా తెలంగాణ వైపు ఉన్నా పోరాడారు. కానీ జగన్ ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పట్నుంచి సీన్ మారిపోయింది.
ప్రమాణస్వీకారం చేయకుండానే హైదరాబాద్ రంజాన్ విందుకు వెళ్లి సచివాలయ భవనాలు ఇచ్చేశారు జగన్. ఆ తర్వాత ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోలేదు. 9, 10 షెడ్యూలులోని ఫిల్మ్ డెవలప్మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టిపిసి, ఎపి భవన్, ఆర్టిసి, సింగరేణి, ఆస్తులపై ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్ని భవనాలను కొలతలు తీసి, సరిహద్దులు నిర్ణయించినా పూర్తి కేటాయింపులు జరగలేదు.
ఎపికి చెందిన ఉద్యోగులు తెలంగాణలో 1,200 మంది వరకూ ఉన్నారు. ఇక్కడ నుండి అక్కడకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1,600 మందికిపైగా ఉన్నారు. మూడేళ్ల క్రితం దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగుల మార్పిడి ఒప్పందం జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఆగిపోయింది. తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పదేళ్లలో పరిష్కరించుకోవాలి. లేనిపక్షంలో పరస్పర అంశాల వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుంది. జగన్ రెడ్డి ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది.