జగన్ తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతారు. ప్రజలు ఏమనుకుంటున్నారో..వాటిపై స్పష్టత ఇవ్వాలని అసలే అనుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే వ్యవహరించారో ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని శ్వేత పత్రం ద్వారా చంద్రబాబు వాస్తవ పరిస్థితులను బయట పెడుతుంటే.. ఎంచక్కా ఇంట్లో కూర్చొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు జగన్.
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేస్తారని ముందే ప్రకటించారు. నిజంగా జగన్ చెబుతున్నట్లుగా చంద్రబాబు చెప్పేవి అవాస్తవాలు ఐతే వాటిని అసెంబ్లీకి హాజరై ఖండిస్తే..జగన్ ప్రసంగానికి విశ్వసనీయత ఉండేది. కానీ, అలా చేయకపోవడమే జగన్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు చేస్తోన్న వాదనలకు బలం చేకూర్చినట్లు అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఆరు అంశాలపై చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వేటిపై కూడా వైసీపీ కిక్కురుమనలేదు. ఆర్థిక విధ్వంసంపై చంద్రబాబు శ్వేతపత్రం అనగానే జగన్ హడావిడిగా మీడియా ముందుకు వచ్చేయడంపై పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ప్రజాస్వామ్య పునాదులపై దాడి..శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం
తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత ఇలాగే సర్కార్ శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తే.. బీఆర్ఎస్ తమ ఘన కీర్తిని చాటుకునేలా కౌంటర్ గా వైట్ పేపర్ రిలీజ్ చేసింది. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరై ప్రభుత్వ శ్వేతపత్రం శుద్ద తప్పని వాదించే ప్రయత్నం చేశారు. వైసీపీ అలా కూడా చేయడం లేదు. జగన్ తాను హాజరు కాకపోయినా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచుతున్నారు. తను రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ను చదివేసి మమ అనిపించేశారు.