వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను.. బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చెబుతూంటారు. దానిలో ఉన్నవి తూ.చ తప్పకుండా అమలు చేస్తానని.. అందులో విఫలమైతే.. తాను విఫలమైనట్లేనని.. ప్రకటిస్తూ ఉంటారు. ఆ మేనిఫెస్టోను అధికారులు అందరూ జేబుల్లో ఉంచుకోవాలని ఆదేశారు. తాను కూడా జేబులో ఉంచుకుంటారు. తన కార్యాలయానికి వెళ్లేదారిలో ఫ్రేమ్ కట్టించి మరీ ఆ మేనిఫెస్టోలో పెట్టారు. అందులో ఎంత వరకూ అమలు చేస్తున్నారో కానీ.. నిఖార్సుగా ఇచ్చిన ఓ హామీని మాత్రం నెరవేర్చలేకపోయారు. అదే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల.
ఏపీలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. చంద్రబాబు అసలు ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని.. ఆరోపించిన జగన్.. తాను అధికారంలోకి రాగానే.. ఖాళీల మొత్తాన్ని భర్తీ చేస్తానన్నారు. ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీనే.. ఎప్పుడు.. ఏయే ఉద్యోగాల్ని భర్తీ చేస్తామో.. వివరిస్తూ.. ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామన్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో.. పలు సందర్భాల్లో.. ఉద్యోగాల భర్తీపై సమీక్షలు చేసినప్పుడు.. జగన్ ఇదే చెప్పారు. తీరా.. జనవరి వచ్చే సరికి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. నిరుద్యోగులు ప్రశ్నిస్తూండటంతో.. జనవరి 31వ తేదీన ఓ రివ్యూ మీటింగ్ పెట్టుకుని.. 63వేల ఖాళీలు ఉన్నాయని.. ఇంకా పరిశీలన చేయాల్సి ఉందని.. ఫిబ్రవరి 21వ తేదీన మళ్లీ సమావేశం అవుదామని చెప్పి పంపించారు.
మీటింగ్ తర్వాత సహజంగా.. ముఖ్యమంత్రి అన్ని పోస్టులను భర్తీ చేయాలని.. చెప్పినట్లుగా… వాటి కోసం అధికారులు శరవేగంగా పని చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన వచ్చింది. కానీ చెబుతున్నాదనికి.. చేస్తున్న దానికి పొంతన లేని వ్యవహారంలా మారిపోయింది. ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయడానికి నిధులేమీ ఖర్చు కావు. ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో చెప్పడానికి కూడా నిధులు ఖర్చు కావు. అయినా.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కావాలనే ఆలస్యం చేస్తుందన్న అభిప్రాయం యువతలో ఏర్పడుతోంది. మేనిఫెస్టోలో పెట్టిన హామీని జగన్ ఉల్లంఘించారని… ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.