ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరుసగా వెలుగు చూసిన ఇసుక మాఫియా, కాల్ మనీ, కల్తీ మద్యం మృతుల కేసు, బాక్సైట్ తవ్వకాలు వంటి అనేక సమస్యలు తెదేపా ప్రభుత్వానికి తీవ్ర అప్రదిష్ట కలిగిస్తున్నవే. వాటి గురించి ప్రజలకు, ప్రతిపక్షాలకు జవాబు చెప్పుకోలేక తెదేపా చాలా ఇబ్బంది పడుతోంది కూడా. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు మొదలవడంతో, అవి వైకాపాకు చాలా బలమయిన ఆయుధాలుగా అందివచ్చేయి. కానీ వాటిని సరిగ్గా ప్రయోగించలేక చతికిలపడింది.
నిన్నటి నుంచి ప్రారంభమయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఆ ఆయుధాలను అధికార తెదేపాపై ప్రయోగించి, దానిని శాసనసభ సాక్షిగా ప్రజల ముందు దోషిగా నిలబెడదామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెగ తహతహలాడిపోయారు. ఆ సమస్యలన్నిటిపై సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైకాపా ముంచే ప్రకటించింది. అలాగా ప్రకటించి చాలా పెద్ద పొరపాటు చేసిందని ఇప్పుడు అర్ధమయ్యింది. ఒకవేళ వైకాపా తన అసెంబ్లీ వ్యూహం గురించి ముందే ప్రకటించకపోయుంటే తెదేపా దొరికిపోయుండేదేమో? కానీ వైకాపా చేసిన ఆ ప్రకటనతో తెదేపా అప్రమత్తమయ్యి అందుకు సరయిన విరుగుడు కనుగొని వైకాపా మీద ప్రయోగించేసరికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నారు.
కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటి అంశాల మీద ప్రభుత్వాన్ని కడిగిపారేద్దామని జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేశంగా సభకి వస్తే, అధికార పార్టీ డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితవిశేషాల గురించి సభలో చర్చ చేప్పట్టింది. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు లేదా ఏ పార్టీ కూడా దానిని వ్యతిరేకించలేడనే సంగతి అందరికీ తెలుసు. ఒకవేళ వ్యతిరేకిస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో కూడా అందరికీ తెలుసు. కనుక జగన్మోహన్ రెడ్డి కూడా డా. అంబేద్కర్ పై సభలో చర్చను వ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు. కానీ ఆ సాకుతో తెదేపా తనకు చెక్ పెట్టగలిగిందనే చేదు వాస్తవాన్ని బాగా అర్ధం చేసుకోగలిగారు. కానీ ఏమి చేయాలో పాలుపోక కాల్ మనీపై చర్చ జరగాలని పట్టుబట్టి సభ నుంచి సస్పెండ్ అయి బయటకు రావలసి వచ్చింది.
తెదేపా వేసిన ఈ ఎత్తుగడ గురించి మీడియా ముందు చెప్పుకొని జగన్ చాలా బాధపడ్డారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా, కల్తీ మద్యం వంటి సమస్యలపై సభలో చర్చ జరగకుండా చేసేందుకే తెదేపా ప్రభుత్వం అజెండాలో లేని డా. అంబేద్కర్ పై చర్చను చేర్చిందని విమర్శించారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా తెదేపా సరిగ్గా అదే ఉద్దేశ్యంతోనే డా. అంబేద్కర్ పై చర్చను చేపట్టి ఉండవచ్చును. కానీ అటువంటప్పుడు తమ పార్టీ ఎటువంటి వ్యూహం అమలు చేయాలో తనకు తెలియదని జగన్మోహన్ రెడ్డి తనంతట తానే మీడియాని పిలిచి మరీ చాటింపు వేసుకొన్నట్లయింది. రాజకీయాలలో ఎత్తులు పై ఎత్తులు సర్వ సాధారణమయిన విషయమే. చంద్రబాబు నాయుడు వేసిన ఈ ఎత్తుకి పైఎత్తు వేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడని స్పష్టమయింది.
చంద్రబాబు నాయుడు తమను మోసం చేసి తప్పించుకొన్నారని జగన్ అక్రోశించడం చూసి ప్రజలు కూడా నవ్వుకొనే పరిస్థితి స్వయంగా కల్పించుకొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుస్తామని చాల ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత ఇలాగే చంద్రబాబు నాయుడు తనను మోసం చేసారని ఆక్రోశించారు. ఆ తరువాత పంట రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదాపై తన పోరాటాలు విఫలమయినప్పుడు ఇలాగే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ఆక్రోశించారు. కానీ దాని వలన తెలుస్తున్నదేమిటంటే చంద్రబాబు నాయుడు చాణక్యం ముందు జగన్ నిలవలేడని! అయితే అందుకు చంద్రబాబు నాయుడుని నిందించడం కంటే జగన్ తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. వైకాపాలో మంచి రాజకీయ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వారి సలహాలు సూచనలు పట్టించుకోకుండా ముందుకు సాగుతూ తల బొప్పి కట్టినప్పుడల్లా ఈవిధంగా అక్రోశించడం పరిపాటిగా మారిపోయింది.