అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి రెండేళ్లయింది. అది ఎలా కొట్టుకుపోయిందనే సంగతిని తర్వాత చెప్పుకుందాం. ముందు విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి. బాదితుల్ని తక్షణం ఆదుకోవాలి. వెంటనే ఆ ప్రాజెక్టుల్ని … విపత్తు వల్ల నష్టపోయిన ఇన్ ఫ్రాను వెంటనే కట్టేయాలి. ఇప్పుడు అంటే రెండేళ్లయిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ?
డ్యాం మళ్లీ కట్టేందుకు ప్రారంభం కాని పనులు
అన్న మయ్య డ్యాను ఇట్టే నిర్మిస్తాం.. .. ఈ సారి బీభత్సం… జగన్ రెడ్డి అంటే.. ఏంటో అన్నమయ్య డ్యాం నిర్మాణంలోనే తెలిసిపోతుందని డబ్బా కొట్టారు. రెండేళ్లు అయింది. టెండర్లు పిలిచి….అంచనాలను భారీగా పెంచి తెలంగాణ రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చారేమో .. బయటకు తెలియదు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జగన్ రెడ్డి భాషలో చెప్పాలంటే… ఇంకా టెంకాయ కూడా కట్టలేదు.
పాపం బాధితులు !
డ్యాం కొట్టుకుపోయిన వారానికి వెళ్లి బాధితుల్ని పరామర్శించిన జగన్ లోకల్ లాంగ్వేజ్ లో అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్నీ తనకు వదిలి పెట్టమన్నారు. వదిలి పెట్టడానికి ఏమీ లేదు అన్నీ కొట్టుకుపోయాయని బాధితులు బోరుమన్నారు. రెండేళ్ల తర్వాత వారికీ అదే పరిస్థితి. ఏడాది కిందట ఇదేంది గురూ అని అక్కడి ప్రజలు మీడియా ముందు ఫైర్ అయితే.. కాంట్రాక్టర్ కు చెప్పి ఇళ్ల పునాదులు వేయించారు. మళ్లీ పట్టించుకోలేదు. . బాధితులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. ఇప్పటికీ బాధితులు స్వచ్చంద సంస్థలు ఇచ్చిన టార్పాలిన్ గుడిసెల్లో ఉంటున్నారు. రోడ్లు నిర్మించలేదు.
రాజంపేట వంతెన కట్టే ఆలోచన కూడా ఉందో లేదో .. నదిలోనుంచే దారి
రాజంపేట ప్రధాన వంతెన పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. వంతెన కింద నుంచి రాకపోకల కోసం రోడ్డు వేశారు. కానీ నదిలో నుంచి రోడ్డు ఎలా వేస్తారనే స్పృహ కూడా రాలేదు. వర్షాలుపడినప్పుడు ఆ రోడ్డు కొట్టుకుపోతోంది. ఇబ్బందులు పడుతున్న ప్రజలకే వాటి గురించి తెలుసు.
ప్రభుత్వ నిర్లక్ష్యమని తేల్చిన కేంద్రం
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం.. ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడంతో అకస్మాత్‌గా వచ్చి పడిన వరదలకు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. గ్రామాలకు గ్రామాలే కాదు.. రోడ్లు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా పార్లమెంట్ కు తెలిపారు.