నేను చెప్పానని మీ నాన్నకు చెప్పు అంటాడో సినిమాలో కమెడియన్. అదేంటి మీరు చెప్పరా .. మీకు భయమా అని అడుగుతాయి ఇతర క్యారెక్టర్లు. అచ్చంగా ఇలాంటి సీనే.. ఏపీ సచివాలయంలో సోమవారం చోటు చేసుకుంది. కానీ అక్కడ కమెడియన్ కు ధైర్యంగా పంచ్ వేయగలిగిన ఆర్టిస్టులు సినిమాలో ఉన్నారు కానీ సచివాలయంలో లేరు. అందుకే మనసులో వేసుకుని ఉంటారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన సమస్యలపై సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో కేంద్రాన్ని నిలదీయాలని సీఎం జగన్ రెడ్డి అధికారులకు గంభీరంగా సందేశం ఇచ్చారు. రాష్ట్ర విభజనతో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని … విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయని జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, పోలవరానికి నిధుల విడుదల చేయడం లేదన్నారు. వీటిపై సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలన్నారు.
హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం.. అందుకే ఎన్నోహామలిచ్చారు. వాటిని నెరవేరిస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని సందేశం ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉందని కూడా జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీని కోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలన్నారు.
జగన్ రెడ్డి మాటలు విని అధికారులు కూడా మనసులో నవ్వుకుని ఉంటారు. అసలు ముఖ్యమంత్రే గట్టిగా మాట్లాడరు. ఆయన అడగనిదే.. అధికారుల్ని ఎలా సీరియస్ గా తీసుకుంటారు. జగన్ రెడ్డి ఢిల్లీకి పోయి కేసులు.. రాజకీయాలు… ప్రతిపక్ష నేతల్ని టార్చర్ పెట్టడం.. ఓటర్ జాబితాలో అక్రమాలపై చూసీ చూడకుండా ఉండటం వంటి వాటిని చక్క బెట్టుకుంటారు.కానీ అధికారుల్ని మాత్రం నిలదీయాలని చెబుతారు. అలా నిలదీసి వచ్చినా అధికారులకు టార్చర్ చూపిస్తారు. మీడియాలో చెప్పుకోవడానికి మాత్రం ఇలాంటి కబుర్లు జగన్ రెడ్డి చెబుతారు