మోడీ తెలివితేటలు మామూలుగా ఉండవు. అందుకే తన మేజిక్‌తో దేశం మొత్తం మీద ఉన్న ఓటర్లందరినీ మాయచేయగలిగాడు. దానికితోడు ప్రత్యర్థిగా రాహుల్‌గాంధీలాంటి ఉత్తరకుమారుడు ఉండడం కూడా మోడీకి భలే కలిసొచ్చింది. 2014లో అధికారంలోకి రాకముందు వరకూ సోనియా గాంధీ, రాహుల్, రాబర్ట్ వాద్రాల అవినీతి గురించి అలుపూ సొలుపూ లేకుండా రోజుల తరబడి మాట్లాడని మోడీ….ప్రధాని పీఠం ఎక్కాక మాత్రం వాళ్ళ అవినీతిని కక్కించడానికి చేసింది ఏమీ లేదు. అలాగని అవినీతి విషయంలో మోడీ మరీ సైలెంట్‌గా ఉన్నాడని కూడా చెప్పలేం. తనకు రాజకీయంగా ఉపయోగపడేలా అవినీతిపైన యుద్ధం చేస్తున్నాడు మోడీ. దేశంలో అవినీతిపరులైన నాయకులకు కొదవేముంది? అలాంటివాళ్ళందరూ కూడా తన విషయంలో భయభక్తులతో ఉండేలా ‘అవినీతిపై పోరాటం’ చేస్తున్నాడు మోడీ. తేడా వస్తే అలాంటి అవినీతిపరులైన నాయకులందరినీ జైలుకు పంపించగలను అన్న హెచ్చరికలు పంపిస్తున్నాడు. రాహుల్ గాంధీలాంటి నేతను జైలుకు పంపిస్తే కమెడియన్ కాస్తా హీరో అయిపోతాడన్న విషయం మోడీకి బాగా తెలుసు.
అలాగే మోడీ ప్రధానమంత్రి సీటుకు ఎప్పటికీ ఎసరు రాకుండా ఉండాలంటే ప్రతిపక్షంలో రాహుల్‌గాంధీలాంటి వాళ్ళే ఉండాలి. అందుకే పదేళ్ళపాటు దేశంలో జరిగిన అవినీతి మొత్తానికి మూల విరాట్టులైన సోనియా కుటుంబం అవినీతి విషయంలో మాత్రం మోడీవారు చూసీ చూడనట్టుగా పోతూ ఉంటారు. ఇక జయలలిత బ్రతికి ఉంటే ….ఆమె అక్రమాస్తులు కేసు ఎలా నడిచి ఉండేదో ఆమె నిర్దోషి అని చెప్పిన కోర్టు తీర్పులే తెలియచెప్తున్నాయి. అలాగే శశికళ కూడా మోడీ సాష్టాంగ పడి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో. కానీ శశికళ కంటే ముందే కట్టు బానిస క్యారెక్టర్‌కి కరెక్ట్‌గా సరిపోయే పన్నీరు సెల్వం జయ దగ్గర పోషించిన పాత్రనే మోడీ దగ్గర పోషించడానికి రెడీ అయిపోయాడు. ఆ దెబ్బతో శశికళకు జైలు బాట పట్టక తప్పలేదు. ఆ ప్రభావం మొత్తం ఇప్పుడు మిగతా నాయకుల మాటల్లో తెలిసిపోతూ ఉంది.
ఇంతకుముందు వరకూ ప్రత్యేక హోదా సభలలో చంద్రబాబును తిట్టిన తిట్టు తిడుతూ ….చాలా సునిశితంగా మోడీ పేరును కూడా ప్రస్తావించిన జగన్ …ఈ రోజు జరిగిన సభలో మాత్రం కనీసం మోడీ పేరు కాదు కదా……కనీసం ప్రధానమంత్రి అన్న పదం కూడా పలకలేదు. కేంద్రప్రభుత్వం అని కూడా విమర్శించే ధైర్యం చేయలేదు.
వెంకయ్యనాయుడిని మాత్రం విమర్శించాడు. అక్కడికేదో ఆయనే ప్రధానమంత్రి అయినట్టుగా. ఇక రాబోయే రాజుల్లో కూడా జగన్ వ్యవహార శైలి కూడా ఇలానే ఉంటుందనడంలో సందేహం లేదు. అంతకుముందు వరకూ మోడీపైన కూడా కాస్త గట్టిగానే విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. లేకపోతే ఒక ఆరు నెలల వరకూ అసలు జనాల ముందుకే రాకుండా ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మొదలెడతాడేమో చూడాలి. ఇక చంద్రబాబు కథ కూడా సేం. ఇక నుంచి మోడీ భజన ఇంకా గొప్పగా ఎలా చేయాలా అని ఆలోచిస్తాడనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం పుట్టిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అయిన వైఎస్ జగన్వారు నరేంద్రమోడీకి సరెండర్ అయ్యారన్న విషయం ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక మిగతా నేతల బానిసత్వం ఏ రేంజ్లో ఉంటుందో ముందు ముందు చూడాలి.