హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలలో వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లిమిట్స్ దాటుతున్నట్లు అనిపిస్తోంది. చంద్రబాబు అధికారమదంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుడుగా మారాడని, రాక్షసత్వాన్ని వీడి మానవత్వం ప్రదర్శించాలని జగన్ అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ ఇవాళ ఏపీ రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలంలో పర్యటించారు. మల్కాపురం గ్రామంలో ఇటీవల దుండగుల చేతిలో చెరకు పంట దగ్ధమైపోయిన ఒక పంటపొలాన్ని సందర్శించి రైతును ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే దారుణంగా మారిపోయిందన్నారు. భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందని ఆరోపించారు. భూసేకరణపై అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. తెలుగుదేశంనేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధానికి ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వటానికి అంగీకరించనందుకుగానూ తెలుగుదేశం నేతలు కక్ష కట్టి ఇలా చెరకు పంటను తగలబెట్టారని అన్నారు. కేసులు పెట్టినా ఉపయోగంలేకుండా పోతోందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగటం ఇది మొదటిసారి కాదని, సంవత్సరకాలంనుంచి జరుగుతున్నాయని అన్నారు. రైతులు ఫిర్యాదు చేయబోతే – సిగిరెట్ కాలిపడటంవలన తగలబడిందని, కేసుపెట్టబోమని డీఎస్పీ అన్నారని, ఫిర్యాదు చేసినా కేసులు పెట్టటంలేదని ఆరోపించారు. బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.