ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ ఎనిమిదో తేదీన సచివాలయంలో.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో.. మూడు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. అందులో మొదటిది… ఆశావర్కర్ల జీతాలు పెంపు. ఆశా వర్కర్లకు.. ఇప్పుడున్న జీతాలను.. రూ. పది వేలకు పెంచుతూ.. జగన్ నిర్ణయం తీసుకున్నారు. అది అధికారికంగా.. సచివాలయంలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటగా తీసుకున్న నిర్ణయం. మామూలుగా అయితే.. వెనువెంటనే.. దీనిపై జీవో విడుదల కావాలి. కానీ… నెల రోజుల పాటు.. దానికి సంబంధించిన జీవో ఊసే లేదు. చివరికి ఆశా వర్కర్లు.. రోడ్లపైకి రావడంతో… రెండు నెలల తర్వాత ఆగస్టు ఏడో తేదీన జీవో విడుదల చేశారు. పెంచిన జీతాలు.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
జూన్ 8న ఆశావర్కర్ల జీతాల పెంపు ఫైల్‌పై జగన్ సంతకం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశావర్కర్ల జీతాల పెంపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి నాళ్లలో.. ఈ జీతాల గురించి గొప్పగా చెప్పారు. ఆశావర్కర్ల జీతాలను రూ. పదివేలకు పెంచిన జగన్ నిర్ణయాన్ని ఇంగ్లిష్ మీడియా కూడా.. గొప్పగా ప్రచారం చేసింది. ఆశావర్కర్లు కూడా… తమ కష్టాలు కొంతైనా తీరుతాయని అనుకున్నారు. కానీ.. అప్పట్నుంచి .. వారికి పెరిగిన జీతాలు అందలేదు. జూలై ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. పెంచిన జీతం వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. ఆ నెల ఉద్యోగులకు.. ఐఆర్ కూడా పెంచకపోవడంతో.. అందరితో పాటు పెంచుతారేమో అనుకున్నారు. కానీ ఆగస్టు నెలలో.. ఒక రోజు ఆలస్యమైనప్పటికీ.. ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందాయి. కానీ.. ఆశా వర్కర్లకు మాత్రం.. గత సర్కార్ ఎంత ఇస్తుందో.. అంతే అందాయి. దాంతో వాళ్లు ఆవేదనకు గురయ్యారు. ఆందోళన బాటపట్టారు.
జీవో జారీకి రెండు నెలల సమయం..!
ప్రస్తుతం ఆశావర్కర్ల జీతాల పెంపును.. పక్కన పెట్టిందనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు పెంచిన జీతాలను ఇవ్వాలంటూ రోడ్డెక్కారు. అమరావతిలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు. వీరి ఆందోళనకు రాజకీయ మద్దతు లభించే పరిస్థితి ఏర్పడటం… ఆశావర్కర్లను.. మోసం చేశారంటూ… చంద్రబాబు ట్వీట్లు చేయడంతో.. ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆగస్టు ఏడో తేదీన జీవో జారీ చేసింది. వేతనాలు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అయితే… ఆశావర్కర్ల జీతాలు పెంచుతూ.. జగన్ సంతకం చేసిన.. జూన్ ఎనిమిదో తేదీ నుంచి కాకుండా.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని… ప్రభుత్వం ప్రకటించింది. అంటే సెప్టెంబర్ ఒకటిన వారు పెరిగిన జీతం అందుకుంటారు. ఈ కారణంగా ఆశా వర్కర్లు.. రెండు నెలలు పెరిగిన వేతనాన్ని కోల్పోయారు.
రోడ్డెక్కి జీవోను సాధించుకున్న ఆశా వర్కర్లు ..!
ఆశావర్కర్లు చిరుద్యోగులు. వారికి గత ప్రభుత్వంలో స్థిరవేతనం.. రూ. మూడు వేలే ఉండేది. అయితే.. వారు చేసే పనిని బట్టి.. మరో రూ. ఐదు వేల నాలుగు వందల వరకు ఇన్సెంటివ్ వచ్చేది. ఎంతైనా వేతనం మాత్రం మూడు వేలే. ఇప్పుడు ప్రభుత్వం.. ఆ జీతాన్ని రూ. పదివేలకు పెంచాలని నిర్ణయించుకుంది. ఇన్సెంటివ్స్ ఇస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ.. పెంచుతామని చెప్పి.. ముఖ్యమంత్రి.. సంతకం చేసిన ఫైల్‌కే.. నెలల తరబడి… మోక్షం లేకపోతే.. వాటిపై ఆశలు పెట్టుకున్న వారిలో అసంతృప్తి పెరుగుతుంది. ఆశావర్కర్లలో అదే పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలు చేస్తే కానీ.. జీవో విడుదల చేయని పరిస్థితి ఏర్పడింది.