ఇవ్వాళ్ళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ కేవలం మన రాష్ట్రంలోనే ఎందుకు తరచూ విద్యుత్ చార్జీలు పెంచుతున్నారనే విషయంపై చాలా ఆసక్తికరమయిన వాదన చేసారు.
పవర్ ఎక్స్చేంజిలలో యూనిట్ విద్యుత్ ధర పగటి పూట రూ. 2.71, రాత్రి సమయాలలో కేవలం రూ. 1.90 లకే అందుబాటులో ఉన్నప్పటికీ, కమీషన్లకి కక్కుర్తిపడే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల నుంచి ఒక్కో యూనిట్ ని రూ. 5.11 కొని సరఫరా చేస్తోంది. ఆ కారణంగానే ప్రజలపై అధనపు భారం మోపవలసి వస్తోందని చెప్పారు. ఈ విద్యుత్ కొనుగోళ్ళలో కూడా చాలా భారీ అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజి కూడా అభ్యతరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఈ.ఆర్.సి.కి ఒక లేఖ కూడా వ్రాసినదని, కానీ ప్రభుత్వం మాత్రం దానిని అసలు పట్టించుకోలేదని జగన్ ఆరోపణల చేసారు.
తన తండ్రి పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని, కానీ చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ పాలనలో తొమ్మిది సార్లు పెంచిందని, అదేమని ప్రశ్నించినవారిని బషీర్ బాగ్ లో తుపాకులు పెట్టి కాల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కూడా విద్యుత్ చార్జీలను చాలాసార్లు పెంచారని, తాము కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసి మరీ కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుకొన్నారని ఆరోపించారు.
దానికి మంత్రి డా. కామినేని శ్రీనివాస్ చాలా ఘాటుగా చెప్పారు. “జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన మనసులో ఏమి జరగాలని కోరుకొంటారో దానికి అనుగుణంగానే వాదిస్తుంటారు. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు దేశంలోకెల్లా అత్యుత్తమయినవని, అందుకు వాటికి 8 ప్రతిష్టాత్మకమయిన అవార్డులు కూడా వచ్చేయని చెప్పారు. మనం ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోయినా, కనీసం ప్రజల కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేసే విద్యుత్ సంస్థలని వాటి పని అవి చేసుకోనీయాలి. ఇటువంటి నిరాధారమయిన ఆరోపణలు చేస్తూ, మన మాటలతో వాటి మనోధైర్యం దెబ్బ తీయడం మంచిది కాదు. మంచి పద్ధతి కాదు,” అని అన్నారు.