పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కుటుంబంలో వివాదాలు పెరిగిపోవడం .. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమవుతున్న సమయంలో.. పార్టీ నేతలతో స్వయంగా ఇంటరియాక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకూ జగన్ ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తారు కానీ అన్ని మండలాలల నేతలతో సమావేశం కారు. ఆయన తరపున నియోజకవర్గ బాధ్యతలు చూసుకునే కొంత మంది వ్యవహారాలు చూసుకుంటారు. వారిలో ఎక్కువ మంది సొంత బంధువులు. కొంత మంది ఆత్మీయులు. అయితే ఇటీవల బంధువుల్లోనూ వివాదాలొచ్చాయి. చక్రాయపేట మండలం చూసుకునే కొండారెడ్డి దూరమయ్యారు.
దీంతో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. తండ్రికి నివాళి అర్పించడానికి పులివెందుల వచ్చిన ఆయన మండలాల వారీగా వైసీపీ క్యాడర్‌తో భేటీ అయ్యారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని.. అసంతృప్తి చెందవద్దని వారికి జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎక్కువ మంది నేతలు.. బిల్లు.. పనులు.. ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అన్నింటినీ పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇలా జగన్ తమతో ప్రత్యేకంగా భేటీ కావడం ఆయా నేతలను కూడా సంతృప్తి పరిచింది. ఇప్పటి వరకూ జగన్ తరపున అటూ కొంత మంది పెత్తనం చేయడం తప్ప.. జగన్ తో నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల తరపున కుటుంబం నుంచే ప్రత్యర్థి బరిలో ఉంటే.. ఇలాంటి సంబంధాలు జగన్‌కు ఉపయోగపడతాయని.. లేకపోయినా.. గత పట్టును కొనసాగించడానికి సరిపోతుందని భావిస్తున్నారు.