ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడో రోజు సోమవారం ఎవరితో భేటీ అయ్యారో స్పష్టత లేదు కానీ అక్కడ్నుంచే కేబినెట్ భేటీ ఏర్పాటు చేయమని సమాచారం ఇచ్చారు. దానికి ఏడో తేదీన ముహుర్తం పెట్టారు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం ప్రారంభమయింది. కీలక నిర్ణయాలు అంటే.. ముందస్తు ఎన్నికలే. సీఎం జగన్ తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అసెంబ్లీల గడువు పూర్తయ్యే రాష్ట్రాల్లో ఈసీ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది.
ఏపీలో కూడా ఎన్నికలు రావాలంటే.. ఎన్నికల సంఘం ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు జరపాలంటే… ఇప్పుడు జగన్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందే. లేకపోతే ఈసీ సన్నాహాల కోసం మరికొంత సమయం తీసుకుంటుంది. అంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు.
అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ ఆయనకు ఈ అంశంపై స్పష్టత రావడంతో ఏడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహణకు సిద్ధమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం ముందస్తుకు వెళ్తారా లేదా అన్నదానిపై ఏడో తేదీన కేబినెట్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.