ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ రకమైన బాధకరమైన పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ వచ్చినా వర్షాలు లేకపోవడం…. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో నలభై శాతం పొలాలు బీడుగానే ఉన్నాయి. మొండిగా పంట వేసిన రైతులు.. మోటార్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటే కరెంట్ ఉండటం లేదు. దీంతో రైతులు పూర్తిగా చితికిపోతున్నారు. నీటి విషయంలో ముందస్తు ప్రణాళికలు ఏమీ లేకపోడవంతో పాటు… రైతుల్ని గాలికి వదిలేయడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు.
మరో వైపు ఏపీలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలు ఇష్టానుసారంగా చేస్తున్నారు. రోజుకు మూడు , నాలుగు గంటల పాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో కరెంట్ కొనుగోలు చేసి ఇవ్వొచ్చు కానీ ఇప్పటికే అడ్డగోలుగా చేసిన ఖర్చులు… ఒప్పందాలతో.. ప్రజలపై పెనుభారం పడింది. ట్రూ అప్ చార్జీలు, ఎఫ్పీపీసీసీఏ చార్జీలు అంటూ.. అసలు చార్జీల కన్నారెట్టింపు వసూలు చేస్తున్నారు. అయినా సరిపడనంత విద్యుత్ ఇవ్వకేపోతున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సీఎం జగన్ ఒక్క సమీక్ష అయినా చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు. అధికారులూ పట్టించుకోవడం లేదు. జరిగేది జరుగుతుందన్నట్లుగా వ్యవహరం మారిపోయింది. మరో వైపు ఇలాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా జగన్ రెడ్డి మాత్రం ఏకంగా పది రోజుల ప్రత్యేక విమానంలో లండన్ యాత్రకు వెళ్లిపోతున్నారు. ఈ పది రోజుల పాటు సజ్జల రామకృష్ణారెడ్డిరాజ్యం చేయనున్నారు . జగన్ ఉన్నా ఆయనే పెత్తనం చేస్తారు కానీ… ఆయన లేని సమయంలో మాత్రం భిన్నం.
ప్రభుత్వం అంటే.. ముందు ప్రజాసమస్యలను పరిష్కరించాలి . కానీ జగన్ రెడ్డి ప్రాధాన్యం వేరు… విపక్షాలపై ఎదురుదాడి చేస్తే చాలనుకుంటోంది. ప్రతిపక్షాలను తిడితే.. కొడితే ప్రజలు సంతోషిస్తారనుకుంటోంది.