అధికారం అందిందన్న ఆవేశంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని .. ఆవేశపడిన జగన్ దెబ్బకు విద్యుత్ సంస్థలు సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం..తర్వాత ధరలు తగ్గించడం.. కరెంట్ తీసుకున్నా.. వాటికి బిల్లులు చెల్లింపులు చేయకపోవడం వంటి మొత్తం ఇప్పుడు ప్రభుత్వానికి చుట్టుకున్నాయి. పీపీఏల ప్రకారం పెండింగ్ బకాయలన్నింటినీ తొమ్మిదిశాతం వడ్డీతో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారనుంది. అదే సమయంలో ఇంత నష్టపోయినా కనీసం పీపీఏ జోలికి వెళ్లలేకపోయారు.
పీపీఏలు అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు. వీటిల్లోవేల కోట్ల అవినీతి జరిగిందని.. సమీక్షించి రద్దు చేసి.. తాము వేల కోట్లు మిగిలిస్తామని ప్రమాణస్వీకార వేదిక నుంచే ఘనంగా ప్రకటించారు. ఆ ప్రకారం ముందూ వెనుకా చూసుకోకుండా చ్యలు తీసుకుంది. సంప్రదాయేతర విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అవినీతి పేరుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే అవినీతి ఉంటే ఆధారాలు ఇవ్వాలని కేంద్రం అడిగింది. పీపీఏల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ.. పలుమార్లు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ పెట్టుబడి దారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వారికి నమ్మకం కలిగించడం కోసం పీపీఏలు ఇక రాష్ట్రాలు మార్చలేవని కేంద్రం చట్టం చేసింది.
” మీకు నిబంధనలు, చట్టాలు తెలియవా..?” అంటూ చాలా సార్లు కేంద్రం నుంచి లేఖలు వచ్చాయి. అయినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు. ఈ ఒప్పందాల విషయంలో అనేక ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం సీఎస్‌గా పని చేసిన అజేయకల్లం . ఆయన జగన్ సర్కారులో సలహాదారుగా పని చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాక ముందే ఆ పార్టీకి అనుబంధంగా సమావేశాలు పెట్టారు.
ఇప్పుడు మొత్తంగా వ్రతం చెడింది.. ఫలితమూ దక్కనట్లుగా జగన్ పరిస్థితి తయారైంది. ఎందుకంటే… ఇప్పుడు.. సుప్రీంకోర్టుకు వెళ్లి కట్టకుండా ఆగే పరిస్థితి కూడా లేదు. విద్యుత్ సంస్ధలకు బకాయిలన్నీ చెల్లించాలి. పీపీఏలు కొనసాగించాలి. ఇలా చేసినందుకు పారిశ్రామిక వర్గాల్లో ఏపీ పరువు పోయింది. కొసమెరుపేమిటంటే… ఇవన్నీ అవినీతి అన్న జగన్… అంతకు మించి… పదివేల మెగావాట్లను సంప్రదాయేతర విద్యుత్ రంగంలో ఒప్పందాలు చేసుకోవడానికి అదీ టీడీపీ హయం కన్నా ఐదేళ్లుఎక్కువగా ముఫ్పై ఏళ్ల పాటు ఒప్పందాలు చేసుకోడానికి సిద్ధమయ్యారు. తాను ఏదైతే అవినీతి అన్నారో అంతకు రెట్టింపు చేశారు. అయితే కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందని మరోసారి నిరూపితమయింది.