ఏపీలో కాంట్రాక్టులు పొందాలంటే అది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ అయినా అయి ఉండాలి లేకపోతే రాఘవ కన్ స్ట్రక్షన్స్ అయినా అయి ఉండాలి. ఎలాంటి ప్రాజెక్టులు అయినా ఈ రెండు కంపెనీలకే దక్కుతూంటాయి. ఇందులో షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో అందరికీ తెలుసు. అది సీఎం జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డిల కుటుంబానికి చెందినది. ఏపీలో సర్కార్ మారక ముందు .. చిన్న చిన్న ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసుకునే కంపెనీ ఇప్పుడు… వేల కోట్ల కాంట్రాక్టులు పొందుతోంది. ఇక రాఘవ కన్ స్ట్రక్షన్స్ తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. జగన్ రెడ్డికి నమ్మిన బంటు అయిన ఈయన ఇటీవల బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.
నిజానికి జగన్ రెడ్డి తల్చుకుంటే ఆయనను బీజేపీలో చేర్చగలరు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ… పొంగులేటిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించింది కూడా. గట్టి ప్రయత్నాలు కూడా కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్న సాకు చూపి పొంగులేటి కంగ్రెస్ లో చేరిపోయారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మూడు, నాలుగు సార్లు జగన్ ను కలిశారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాతా కలిశారు. ఆ తర్వాత కూడా ఆయనకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇస్తున్నారు. తాజాగా భూగర్భ విద్యుత్ లైన్ల కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. ఈ కాంట్రాక్టుల వెనుక అసలైన స్కెచ్ ఉందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉన్నా… తన జోలికి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున జగన్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని.. అది పొంగులేటి ద్వారా పంపుతున్నారన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. లేకపోతే పిలిచి మరీ పొంగులేటికి కాంట్రాక్టులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. జగన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఇలా ప్రజల సొమ్మును రాజకీయ అవసరాల కోసం… తప్పుడు కాంట్రాక్టుల ద్వారా దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇప్పటికే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించని జగన్ రెడ్డి సర్కార్ పొంగులేటి కంపెనీలకు పెద్ద ఎత్తున బిల్లులు మంజూరు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.