అధికారంలో ఉన్న వారు తాము చేయలేకపోయాం.. వేరే వాళ్లు అడ్డుకున్నారని చెబితే అంత కంటే చేతకాని తనం ఇంకేమీ ఉండదు. నిజానికి అధికారంలో ఉంటే చేయలేనిదేమీ లేదు. రాత్రికి రాత్రి రూ. పదమూడు వేల కోట్లు బిల్లులు చెల్లించేసినట్లుగా.. రాత్రికి రాత్రి పెన్షనర్లకు రూ. రెండు వేల కోట్లు ఇవ్వలేరా ?. ఇవ్వొచ్చు. కానీ చేతులు రావు కదా! . అందుకే అడ్డుకున్నారన్న స్ట్రాటజీతో తెర ముందుకు వస్తున్నారు.
ఏపీలో ఇప్పుడంతా పెన్షన్ రాజకీయం. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఖజానా మొత్తం ఊడ్చి అస్మదీయులకు బిల్లులు చెల్లించారు. ఇప్పుడు ఏప్రిల్ లో ఫ్రెష్ గా అప్పు తెచ్చి జీతాలు, పెన్షన్లు.. సామాజిక పెన్షన్లు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే అధికారికంగానే మూడో తేదీ నుంచి పెన్షన్ అని గతలో ఆదేశాలిచ్చారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను వాడొద్దని చెప్పడంతో.. ఇదే చాన్స్ అనుకుని.. ఇంకా ఆలస్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి కారణం టీడీపీనేనని చెప్పాలనుకుంటున్నారు.
నిజానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నారు అంటే.. నమ్మేసి.. విపక్షాలపై విరుచుకపడే స్థితిలో జనం లేరు . ఆ విషయం తెలంగాణలో తేలిపోయింది. ప్రతీ పథకాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని… ఆపేశారు కేసీఆర్ కానీ ప్రజలు పట్టించుకోలేదు. రైతు బంధు నిధుల విషయంలో డబ్బులు ఇచ్చేందుకు ఈసీ అంగీకరించినా చివరి క్షణంలో నిలిపివేసింది. ఇది బీఆర్ఎస్ చేతకానితనమేనని అక్కడి ప్రజలు తీర్పిచ్చారు.
ఇప్పుడు ఏపీలో దాదాపుగా అన్ని పథకాలకూ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఫ్రెష్‌గా వచ్చే అప్పులు తెచ్చి లబ్దిదారుల ఖాతాల్లో వేయాలనుకుంటున్నారు. వేయలేకపోతే అది చేతకాని తనం అవుతుంది. టీడీపీ వల్లే వేయలేకపోయామని చెబితే ప్రజలు కన్విన్స్ కారు. ఇలా చేయడం రాంగ్ స్ట్రాటజీగా తెలంగాణలో తేలిపోయింది.