టెన్త్ పరీక్షలను సీఎం జగన్ రద్దు చేయకపోవడాన్ని టీడీపీ యువ నేతలు ఓ అవకాశంగా తీసుకున్నారు. ముందుగా లోకేష్.. టౌన్ హాల్ మీటింగ్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులతోనూ మాట్లాడించారు. పరీక్షలు రద్దు చేయాలి లేదా.. వాయిదా వేయాలన్న డిమాండ్‌ను వినిపించారు. అయితే లోకేష్ ఇలా డిమాండ్ చేస్తున్నారనో.. మరో కారణమో కానీ… నైట్ కర్ఫ్యూ విధించడానికి సిద్ధపడిన ఏపీ సర్కార్ పరీక్షలను మాత్రం రద్దు చేయబోమని ప్రకటించింది. దీంతో మరికొన్ని రోజులు పరీక్షల రద్దుకు ఆన్ లైన్ ఉద్యమం చేయవచ్చని టీడీపీ యువ నేతలు ఫిక్సయిపోయారు. ఆదివారం టౌన్ హాల్ మీటింగ్ పెట్టేశారు.
చీపురుపల్లి నాగార్జున నుంచి పుత్తూరు భానుప్రకాష్ వరకూ.. అందరూ ఈ ఆదివారం టౌన్ హాల్ మీటింగ్ పెట్టి.. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. పరీక్షలు పెడితే విద్యార్థులు ఎలా సఫర్ అవుతారో వివరించారు. ఆన్ లైన్లో ప్రచారం చేసుకున్నారు. పరీక్షలు ఉంటాయా.. ఉండవా అన్న సందిగ్ధం… పరీక్షలకు వెళ్తే ఎక్కడ తమ పిల్లలు కరోనా బారిన పడతారో అన్న భయం… ప్రజల్లో ఉంది. దీన్ని టీడీపీ యువనేతలు బాగానే క్యాచ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వర్క్ ఫ్రం హోం చేస్తూ తమ ఆలోచనలను ప్రజల ముందు ఉంచుతున్నారు. నిజానికి ప్రభుత్వం కూడా పరీక్షలను రద్దు చేయాలనే ఆలోచనలోనే ఉంది.
కానీ లోకేష్ డిమాండ్ చేయడం ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు రద్దు చేస్తే.. వారి కారణంగా రద్దు చేశారన్న ప్రచారాన్ని టీడీపీ చేసుకుంటుందని వెనుకజడుగు వేస్తున్నారు. 29న విద్యా శాఖపై సమీక్ష చేసి.. కేబినెట్ భేటీలో పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం ప్రభుత్ వర్గాల్లో ఉంది. ఈ లోపు హైకోర్టులో పిటిషన్ వేయాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. మొత్తానికి జగన్ రాజకీయ పట్టదలను.. రాజకీయంగా వాడుకోవడంలో టీడీపీ యువనేతలు చాతుర్యం ప్రదర్శిస్తున్నారు.