అక్రమాస్తుల కేసులో నిందితుడైన జగన్ తన కుమార్తె చదువుకుంటున్న కాలేజీలో కాన్వొకేషన్లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లేందుకు వారం రోజుల పర్మిషన్ కావాలని సీబీఐ కోర్టును అడిగారు. అలా ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు న్యాయమూర్తి పది రోజుల పర్మిషన్ ఇచ్చారు. అసలు జగన్ అడిగితే వారం అయితే.. న్యాయమూర్తి పది రోజుల పర్మిషన్ ఇవ్వడంతో జగన్ తరపు లాయర్లు ఖుషీ అయ్యారు. సీబీఐ న్యాయవాదులు ఉత్తినే కౌంటర్ వేశారా.. లేకపోతే ఏమైనా వాదనలు వినిపించారా అనే సెటైర్లు బయట నుంచి వినిపిస్తున్నాయి.
అడిగిన దాని కంటే ఎక్కువ రోజులు పర్మిషన్ ఇవ్వడం విచిత్రమే. సీబీఐ చాలా వరకూ అక్రమాస్తుల కేసుల్లో జగన్ కు సానుకూలంగా ఉంటోందని… విచారణ ఆలస్యం కావడానికి సహకరిస్తోందన్న ఇతర పక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కోర్టుకు హాజరు కాకపోయినా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నాయి. న్యాయస్థానాల నుంచి మినహాయింపులు కూడా పొందకుండానే విచారణకు రావడం లేదని అంటున్నారు. అయినా సీబీఐ ఏమీ అనడం లేదని. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కూడా చెప్పడం లేదన్నారు.
అదే సమయంలో జగన్ ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లారు. కోర్టు నుంచి దావోస్ పర్యటనకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ ముందుగా ప్లాన్ చేసుకుని మరీ లండన్ వెళ్లి ఒకరోజు ఉండి… ఆ తర్వాత దావోస్ వెళ్లారు. అంటే బెయిల్ షరతులు.. కోర్టు షరతులు ఉల్లంఘించినట్లే. ఈ విషయాన్ని కూడా సీబీఐ కోర్టులో ప్రస్తావించలేదు. దీంతో … అంతా ఓ పద్దతి ప్రకారం.. వ్యూహాత్మకంగా కలిసి విచారణ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.