వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరసిస్తూ మే 16 నుంచి మూడు రోజులు కర్నూలులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే అది ఆయనకు అనుకూలంగా కాక వ్యతిరేకంగా ఉంటోంది. అందరి కంటే ముందుగా ఏపి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ, “రాష్ట్రానికి నష్టం కలిగించే తెలంగాణా ప్రాజెక్టుల గురించి మేము పట్టించుకోలేదన్న జగన్ ఆరోపణలు అవాస్తవం. మేము ఈ సమస్యల గురించి కృష్ణా, గోదావరి జలవనరుల బోర్డులలో గట్టిగా మాట్లాడుతూనే ఉన్నాము. జగన్ తన పార్టీని కాపాడుకొనేందుకు తెలిసీ తెలియకుండా ఏవేవో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.
తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కూడా జగన్ ఆరోపణలని తప్పు పట్టారు. ఆంధ్రాలో తెదేపా, వైకాపాల మద్య జరుగుతున్న రాజకీయాల కోసమే తెలంగాణా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు.
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు కూడా జగన్ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు డా. రాజశేఖర్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీళ్ళు తరలించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణాలో నిర్మించే ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రాకి నష్టం కలుగుతుందని వాదిస్తూ జగన్ నిరాహార దీక్ష చేయడం సరికాదని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్టులపై ఏపి కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాష్ట్రంలో అందరికంటే ముందుగా తెలంగాణాలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మాట్లాడారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఆయన నిరసనలు ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. దానిని జగన్ అందిపుచ్చుకోగానే చాలా హైలైట్ అవుతోంది. అంటే ఈ వ్యవహారంలో అసలు సమస్య కంటే దానిని లేవనెత్తిన వ్యక్తిని బట్టే దానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రాజెక్టులపై రఘువీరా రెడ్డి నిరసనలు తెలిపినపుడు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే సమస్యపై జగన్ దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించగానే, వాటి గురించి కేంద్రంతో మాట్లాడుతానని చెప్పడమే అందుకు చక్కటి ఉదాహరణ.