ఎనిమిది నెలల పాటు రిజర్వ్ చేసిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఇవాళ ప్రకటించింది. ఆ తీర్పు సారాంశం జగన్ సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానక్కరలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించినప్పుడు మాత్రం జగన్ హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇక నుంచి జగన్ తరపున ఆయన తరపున న్యాయవాది.. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది.
అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ మొదట సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ కోర్టు తిరస్కరించడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారని.. రోజూ విచారణకు హాజరైతే పాలనకు అటంకం కలుగుతుందని జగన్ తరపు లాయర్లు వాదించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ హోదా పెరిగినందున… సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది.
గత ఏడాది డిసెంబర్లో రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత ఇవాళ వెల్లడించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులుతో ఏపీ సీఎం కు పెద్ద ఊరట లభించినట్లయింది. అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ ప్రారంభమైతే ఆయన రోజూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆయన ఏపీలో సీఎంగా విధులు నిర్వర్తించడం కష్టమయ్యేది.