జగన్ రెడ్డి సర్కార్ మళ్లీ రాదని వైసీపీ పెద్దలకూ అర్థమైపోయింది. చివరికి జగన్ రెడ్డికి కూడా అర్థమైపోయిందేమో కానీ.. రెడ్డి గార్ల కంపెనీలకు ముందుగానే చెల్లించేందుకు రూ. పదిహేను వేల కోట్లను రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు చేశారా లేదా అన్నది కాదు.. ముందుగా చెల్లింపులకు ప్లాన్ చేసేశారు. ఇందు కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. లెక్కా పత్రం లేకుండా నియమ నిబంధనలు లేకుండా చెల్లింపులు ప్రారంభించారు . దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించడంతో చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్రానికి లేఖ పంపింది. అయితే ఇలాంటివన్నీ పట్టించుకునే స్టేజ్లో లేమని ప్రభుత్వం చేతలతోనే చెప్పేసింది.
మామూలుగా అర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో అస్మదీయులకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. కానీ ఈ సారి జనవరి కల్లా ఈ చెల్లింపులు పూర్తి చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో పనులు చేపడుతున్న కంపెనీలు ఓటర్లు… మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమానులు అయిన జగన్ రెడ్డి బంధువులు, మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ , అరబిందో రెడ్డి.. ఇలా ఓ గ్రూప్ ఉంది. వారు పనుల చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. వేల కోట్ల బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు అయిపోతున్నాయి.
మరో వైపు చిన్నా చితకా పనులు చేసిన కాంట్రాక్టర్లు కిందా మీదా పడుతున్నారు. తమ బిల్లులు ఇప్పించండి మహో ప్రభో అని కాళ్లపై పడుతున్నారు. ఏపీలో చిన్న చిన్నహోటళ్లు.. చిన్న చిన్న సామాగ్రి సరఫరా చేసే వారినీ వదలకుండా ప్రభుత్వం నాకేసింది. కొన్ని వేల మంది ఇలాంటి వారు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఓ హోటల్ నుంచి బాధితులకు తిండి ప్యాకెట్లు సరఫరా చేయించిన అధికారులు బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఇది జరిగి మూడేళ్లవుతోంది. స్పందన కార్యక్రమంలో ఆ హోటల్ యజమాని అయిన వృద్ధుడు.. అధికారుల కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. విజయవాడలో ఇటీవల సీఎం జగన్ కోసం హోమం నిర్వహించారు. ఆ హోమానికి దేవాదాయ శాఖ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టింది. కానీ ఆ హోం కోసం … అరటిచెట్లను సరఫరా చేసిన వారికి బిల్లులు ఇవ్వలేదు. ఆ కాంట్రాక్టర్ కూడా మండిపడుతున్నారు. డబ్బుల్లేకపోతే హోమాలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చివరికి సీఎం జగన్ పర్యటనల్లో పరదాలు కట్టే వారికీ పూర్తిస్థాయిలో బిల్లులు ఇవ్వడం లేదు. చాలా సార్లు ఆ కాంట్రాక్టర్లు మీడియాకు సమాచారం ఇచ్చి మరీ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ప్రభుత్వం తుడిచేసుకుని వెళ్లిపోతోంది.
ప్రభుత్వ పనులే కదా… ఇవాళ కాకపోతే రేపైనా డబ్బులు వస్తాయనుకుని చిన్న చిన్న వ్యాపారులు ఆశ పడితే వారి జీవితాంతం బాధపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వారు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎవరికీ బిల్లులు ఇవ్వడం లేదు. హైకోర్టుకు వెళ్తే.. ఆ ఒక్కరికి మాత్రం ఇస్తోంది. చివరికి ప్రభుత్వం పేరుతో పేదలకు కడుపు నింపిన వారికీ బిల్లులు ఇవ్వకపోవడం మహా పాపం అన్న శాపనార్థాలు వినిపించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ వారికి వేల కోట్ల చెల్లింపుల కోసం అప్పులు చేయడానికి రెడీ అయిపోయారు.