ఆన్ లైన్ పోర్టల్స్‌లో ఫలానా బ్యాంక్ కార్డ్ వాడి ఫోన్ కొంటే పది శాతం క్యాష్ బ్యాకో.. డిస్కౌంటో ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి మంచి స్పందన వస్తూ ఉంటుంది. ఇది ఏపీ సర్కార్ పెద్దల్ని బాగా ఆకట్టుకున్నట్లుగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళnకు ఏదైనా తాయిలం ఇవ్వాలనుకున్న ఏపీ సర్కార్‌కు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఈ “టెన్ పర్సంట్” ఆఫర్ గుర్తుకు వచ్చింది. వెంటనే అమల్లోకి తెచ్చేశారు. ఎనిమిదో తేదీన సెల్ ఫోన్లు కొనాలనుకునే మహిళలకు ప్రభుత్వం ఎంపిక చేసిన దుకాణాల్లో పది శాతం మేర డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం దుకాణాలను ఎక్కడ ఎలా ఎంపిక చేస్తుందన్నది తర్వాత అధికారులు నిర్ణయిస్తారు.
ఆ దుకాణాలు అయితే ఏపీలోనే ఉంటాయి. అందులో సందేహం ఉండదు. అయితే ఉత్తినే టెన్ పర్సంట్ డిస్కౌంట్ ఎందుకు… కొన్న వెంటనే… దిశ యాప్‌ను ఇన్స్టార్ చేసుకోవాల్సి ఉంటుంది. దిశ యాప్ మహిళల భద్రత కోసం ఏపీ సర్కార్ తీసుకొచ్చిన యాప్. దీని వల్ల… ఆపదలో ఉంటే వెంటనే పోలీసులను కన్సల్ట్ అవ్వొచ్చు. యాప్ ను ఆవిష్కరించిన మొదట్లో పోలీసులు కాస్త హడావుడి చేశారు. కానీ పెద్దగా డౌన్ లోడ్స్ రాలేదు. ఇప్పుడు.. ఆ యాప్ పై మరింత దృష్టి పెట్టాలని జగన్ నిర్ణయించి… టెన్ పర్సంట్ డిస్కౌంట్ ఇచ్చి మరీ డౌన్ లోడ్స్ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇంకా చాలా ఆఫర్లు ప్రకటించారు.
కానీ.. గతంలోనూ చాలా ప్రకటనలు చేశారు. దేనికీ సరైన కార్యాచరణ లేకపోవడంతో అన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అయిన ఈ టెన్ పర్సంట్ మాత్రం.. హైలెట్ అవుతోంది. నిజంగా ఇప్పుడు ఫోన్లు కొనాలనుకునేవారిలో సగానికిపైగా ఆన్ లైన్‌కే ప్రిఫర్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎనిమిదో తేదీన అదీ కూడా మహిళలే ఎంత మంది ఫోన్లు కొంటారో.. ప్రభుత్వం ఎంపిక చేసిన దుకాణాల్లోనే ఎంత మంది కొంటారో .. అంచనా వేయలేం. ఎన్ని ఫోన్లకు మహిళలకు “టెన్ పర్సంట్” డిస్కౌంట్ ఇప్పిస్తారో వేచి చూడాలి..!