ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. జీతాలు కూడా నెలంతా వచ్చిన వరకూ పంపిణీ చేయాల్సిన పరిస్థితి. ఇక రోజువారీ ఖర్చులకూ నిధులు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో పొదుపు బాట పట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పాలని.. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఆదిత్యనాథ్ దాస్ పరిశీలన జరిపి.. డబ్బులు ఆదా అయ్యే మార్గాలను గుర్తించి… ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది.
ప్రభుత్వం ఎంత ఆర్థిక కష్టాల్లో ఉన్నా… దుబారా ఎక్కువగా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ నెలలో ఒకటి రెండు సార్లు కూడా… పర్యటనలకు వెళ్లరు. కానీ ప్రత్యేక విమానాన్ని ఏపీ ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఆయన పర్యటనలకు వెళ్లే సమయంలో అద్దెకు తీసుకోవడం వేరు.. అసలు అట్టే పెట్టుకోవడం వేరు.. ఇలాంటి ఖర్చుల దగ్గర్నుంచి లెక్కలేనన్ని దుబారా ఖర్చులు ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయి. ప్రతీ చిన్న దానికి ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నారు. దానిపై సామాన్య ప్రజల నుంచీ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత మీడియాకు దోచి పెట్టడానికే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక పెద్ద ఎత్తున అవసరం లేని సలహాదారులు ఉన్నారు. ఇలా రోజు రోజుకు దుబారా ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి..కానీ ఎక్కడా కంట్రోల్ చేసే ప్రయత్నం జరగలేదు.
ఇప్పుడు చీఫ్ సెక్రటరీపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ప్రభుత్వ పెద్దలకు ఏది దుబారాగా కనిపించదో.. దాన్ని మాత్రమే గుర్తించి… ఆ ఖర్చును కంట్రోల్ చేయాలని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అంటే వాటిల్లో మీడియాకు ప్రకటనలు… సలహాదారుల ఖర్చులు.. ఇతర అంశాలు ఉండవు. ఉద్యోగులకు సంబంధించి ఏమైనా సౌకర్యాలు కల్పిస్తూంటే… వాటిని నియంత్రించి.. ఖర్చును ఆదా చేసుకోవాలన్న సిఫార్సులు ఆయనచేయాల్సి ఉంటుంది. కానీ.. ఎంత తగ్గించినా అవి నామమాత్రంగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నిజానికి ఖర్చులు తగ్గించాలనే లక్ష్యం.. ప్రభుత్వానికి ఉంటే.. ముందుగా ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆలోచన చేస్తారు. కానీ.. ఎలాంటి ఆలోచన చేయకుండా ఇష్టారీతిన హామీలు.. ప్రకటనలు గుప్పించడమే కాకుండా… రిటైరైన ఓ సామాజికవర్గ ఉద్యోగులను కూడా పెద్ద ఎత్తున పోస్టులు సృష్టించి.. నియమించుకుంటూంటే.. ఖర్చులు పెరగక.., తగ్గే అవకాశం లేదు.ఇప్పుడు సీఎస్ కూడా…సీరియస్గా నివేదిక ఇస్తారో.. రేపోమాపో రిటైరైపోతున్నా కాబట్టి…ఈ కొద్ది రోజులు లైట్ తీసుకుంటారో వేచిచూడాలి..!