ఎన్నికలు వస్తున్నాయి. గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన వాటికి నాలుగేళ్ల తర్వాత మళ్లీ శంకుస్థాపనలు చేయడంతో పాటు గత ప్రభుత్వం చేస్తూంటే తాను వచ్చాక ఆపేసిన పనులను రీ లాంచ్ చేస్తున్నారు సీఎం జగన్. దానికి తన పేరు పెట్టుకోడమే కొత్త. అందులో ఒకటి జగనన్నకు చెప్పుకుందాం. మరి నాలుగేళ్ల పాటు ప్రజలు ఎవరికి చెప్పుకున్నారు. స్పందన పేరుతో చేసిన హడావుడి అంతా ఏమైపోయింది ? అందులో సమస్యలకు పరిష్కారాలు ఎందుకు లభించలేదు ? వీటన్నింటికీ ముందు సీఎం జగన్ సమాధానం చెబుతారా ?
గత ప్రభుత్వంలో పీపుల్స్ ఫస్ట్ పేరుతో ఇదే కాల్ సెంటర్ !
చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన తర్వాత పీపుల్స్ ఫస్ట్ పేరుతో ఓ కాల్ సెంటర్ ను నిర్వహించారు. ఎక్కడి నుంచి ఫిర్యాదు చేసినా తక్షణం చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దిగువస్థాయి ఉద్యోగులు లంచం తీసుకున్నా.. అనేక చోట్ల తిరిగి ఇప్పించిన ఉదంతాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లాలో ఓ రైతు వద్ద మీటర్ పెట్టడానికి డబ్బులు తీసుకున్న ఉద్యోగికి ఈ కాల్ సెంటర్ ఇచ్చిన షాక్ వైరల్ అయింది. క్షణాల్లో రైతుకు డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని నడుస్తున్న కాల్ సెంటర్ను సీఎం రాగానే మూసిసి స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్పందన నిర్వీర్యం !
ఆన్ లైన్ వ్యవస్థను ఆపేసి నేరుగా ప్రజలే వచ్చి ఫిర్యాదులు చేసేలా సీఎం జగన్ స్పందన అనే గ్రీవెన్స్ కార్యక్రమం పెట్టారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జనం కొత్తలో బాగా వచ్చేవారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి వాడుకున్నారు. ఇష్టం లేని వారి మీద వైసీపీ నేతలతో స్పందనలో ఫిర్యాదులు తీసుకుని అడ్డగోలు కేసులు పెట్టడానికి వాడుకున్నారు కానీ.. ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతూండటంతో ఇప్పుడు జగనన్నకు చెప్పుకుందాం అంటూ కొత్త ప్రచారం ప్రారంభించారు.
కనీసం ఇందులో అయినా నిజాయితీగా ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారా ?
ఈ కాల్ సెంటర్ ఎప్పట్లాగే ఐ ప్యాక్ ఆధ్వర్యంలో నడుస్తుంది. జగనన్న వాయిస్ వినిపిస్తారు. అంత వరకూ బాగానే ఉన్నా… అసలు చూపాల్సింది సమస్య పరిష్కారం. ఒకటి రెండు.. సమస్యలు పరిష్కరించి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి గొప్పగా చేశామని చెప్పుకోవడం కాదు. నిజంగా సమస్యలు పరిష్కరించాలి. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ నిర్వాకాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తాయి. వాటిని ధైర్యంగా ముందుపెట్టి పరిష్కరించాలి. వైసీపీ నేతల దందాల గుట్టు విప్పాలి. అలా అయితేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుకుంటారు.