” బ్యాడ్ లీడర్స్ బిలీవ్ దట్ దే హావ్ టు ప్రొజెక్ట్ కంట్రోల్ ఎట్ ఆల్ టైమ్స్ ” .. ఓ చెడ్డ నాయకులు అన్ని రకాల పరిస్థితుల్ని తాను శాసించగలనని అనుకుంటారు. చివరికి వారి పతనం ఓటమితో ముగుస్తుంది. ప్రపంచంలో ప్రజా స్వామ్య దేశాల్లో రాజకీయాలకు క్లైమాక్స్ ఇదే. ఎందకంటే ప్రజల చేతల్లో అధికారం ఉంటుంది. ఓట్లు వేసినప్పుడల్లా వారు తమ తరపున అధికారం చెలాయించడానికి ఇంకా చెప్పాలంటే.. తమను పరిపాలించడానికి అవకాశం ఇస్తారు. కానీ దురదృష్టవశాత్తూ..తమకు అధికారం ఇచ్చే ప్రజలు అందరూ కాదని.. కొంత మందేనని.. వారిని మచ్చిక చేసుకుంటే చాలని..తాము ఎల్ల కాలం అధికారంలో ఉంటామనే దుర్భుద్దితో కూడిన నయా నియంతలు ప్రజాస్వామ్యంలోకి చొచ్చుకు వచ్చేస్తున్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి . ఆయన రెండో సారి అధికారంలోకి రావడానికి వై ఏపీ నీడ్స్ జగన్ ? అనే క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్యాంపెయిన్ లోనే ఎంతో అహంకారం ధ్వనిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఏపీకి జగన్ అవసరం ఏముందని విశ్లేషించుకుంటే.. ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ దొరకదు. ఇప్పటి వరకూ అంటే గత నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన ప్రమాణస్వీకారం సందర్భంగా చెప్పిన మాటలేంటి.. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలేంటి.. తీరా అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులేంది అని విశ్లేషించుకుంటే.. దేశ రాజకీయాల్లో ప్రజల్ని ఇంత కన్నా ఘోరంగా మోసం చేసి.. కూడా.. వై ఏపీ నీడ్స్ జగన్ అని ధైర్యంగా ప్రచారం చేసుకోగలిగే నేత ఒక్కరే అయి ఉంటారు. అందులో సందేహం లేదు.
పథకాల పేరుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్న సీఎం.. వై ఏపీ నీడ్స్ ?
తాను ఎంత కష్టం అయినా బటన్లు నొక్కుతున్నానని.. అదొక్కటే చేస్తున్నానని జగన్ చాలా సార్లు చెప్పుకున్నారు. బటన్లు నొక్కడం కష్టమైన పనేమీ కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా బటన్లు నొక్కితే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి. ఆ ఫెయిల్ అవ్వకుండా నొక్కుతున్నానని జగన్ అర్థం. పథకాల కోసం ఎక్కడెక్కడ ఆస్తులు తాకట్టు పెట్టి.. భవిష్యత్ ను పణంగా పెట్టేసి నిధులు సమీకరించి.. పావలో అర్థో.. ప్రజల ఖాతాల్లోకి మళ్లిస్తున్నానని ఖచ్చితంగా ఆ పావలా.. అర్థ తీసుకున్న వారి దగ్గర నుంచి ఓట్లను ప్రతిఫలంగా పొందాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఓ కుటుంబ ఖర్చు నెలకు రూ. పదివేలుఇంటే..ఏపీలో పదిహేను వేలు ఉంటోంది. ద్రవ్యోల్బణం దేశంలోనే ఏపీలో అత్యంత ఎక్కువ. ఎందుకంటే పన్నులు ఎక్కువ. అంటే.. ఏటా అరవై వేలు నిత్యావసర వస్తువుల మీదే పన్నుల రూపంలో ఎక్కువ వసూలు చేస్తున్నారు.కానీ పేద కుటుంబాలకు డైరక్ట్ డీబీటీ ద్వారా అంత వస్తున్నాయా అంటే.. చెప్పడం కష్టం. రాష్ట్రంలో సగం కుటుంబాలకు అసలు పథకాలు అందవు. ఉన్న సగం కుటుంబాల్లోనూ ఒక్కొక్కరికి ఒక్కో పథకంతో..మహా అయితే ఓ పది వేలు ఖాతాలో జమ చేస్తారు. మిగతా యాభై వేలు ఆ కుటుంబం నుంచి ప్రభుత్వం పిండుకుంటుంది. ఇటీవలి కాలంలో బటన్లు నొక్కడం అనేది ఓ ఫార్స్ గా మారిపోయింది. బటన్లు నొక్కగానే డబ్బులు పడుతున్నాయని ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పటికీ పడటం లేదు. ఒక్క సారి పథకాలపై గ్రీవెన్స్ పెడితే లక్షల మంది తరలి వస్తున్నారు. అందుకే .. కాల్ సెంటర్ పెట్టారు.అందులో వచ్చిన ఫిర్యాదుల దెబ్బకు.. సురక్ష అనే కార్యక్రమం చేపట్టాల్సి వస్తోంది. కానీ ఇంత కాలం ఆపేసి.. ఇప్పుడు ఎన్నికలకు ముందు కొంత మందికి పథకాలు ఇస్తే నమ్మెదేవరు. ఇాలాంటి బటన్లు నొక్కడానికా.. వై ఏపీ నీడ్స్ జగన్ ?
ఏపీ జీవనాడి ఉసురు తీసిన లీడర్ ..వై ఏపీ నీడ్స్ ?
అప్పులు చేసి .. ఆస్తులు అమ్మి బటన్లు అందరూ నొక్కుతారు. కుటుంబ పెద్ద అన్న తర్వాత కాస్తంత బాధ్యతగా ఉండాలి. నికరంగా రాత మార్చే పనులు ఉంటే వెంటనే చేసేసుకోవాలి. కానీ జగన్ రెడ్డి ఏం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పడుకోబెట్టేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు ఇచ్చే కులపోళ్లకు టెండర్ కట్టబెట్టారు. ఎత్తిపోతల పేరుతో మోటర్లు పెట్టే కాంట్రాక్టులు మాత్రమే చేసిన మేఘా పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసేసింది. పనులు ఆలస్యం కావడంతో.. కీలకమైన నిర్మాణాలు.. డయా ఫ్రంవాల్, గైడ్ బండ్ వంటివి దెబ్బతిన్నాయి. మెయిన్ డ్యాం పనులు మేఘా ఒక్క శాతం కూడా చేయకపోవడం మంచిది అయింది. లేకపోతే.. ఏమయ్యేదో కానీ.. ఇప్పుడు డయాఫ్రంవాల్, గైడ్ బండ్ నిర్మాణాలు మళ్లీ కొలిక్కి రావాలి.. ఆ తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం నిర్మాణం ఒక్క రోజు ఆగితే ఐదు కోట్ల నష్టం వస్తందని సీఎం కంగారు పడేవారు. ఒక్క రోజు పని ఆగకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాంటిది నాలుగున్నరేళ్లపాటు పనులు జరగలేదు. ఇప్పుడు జరుగుతాయన్న గ్యారంటీలేదు. వరద వచ్చే సమయం. పోలవరం జీవనాడి .. అందులో .మరో మాట లేదు. మరి ఆ జీవనాడి ఉసురు తీసేసి చిన్నసైజు బ్యారేజీలా చేయడానికి సిద్ధమైన పాలకుడు.. వై ఏపీ నీడ్స్ ?
సొంత రాష్ట్ర రాజధానిపై కుట్ర చేసే నాయకుడు వై ఏపీ నీడ్స్ ?
రాష్ట్రమంటే.. ముఖ్యమంత్రికి ఓ కుటుంబం లాంటిది. ప్రజల ఆస్తికి ఆయన కస్టోడియన్. అంతే కాదు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచడానికి ఆయన చేసే ప్రయత్నాలే నాయకత్వ సామర్థ్యం. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి.. అబ్దుల్ కాలం గారి మాటల స్ఫూర్తితో.. ధింక్ బిగ్ అన్నట్లుగా ప్లాన్ చేసి గత ప్రభుత్వం అన్నీ రెడీ చేసింది. ఆయన పెద్దాయన.. తాను యువకుడ్ని తాను వేగంగా కట్టేస్తానని గాల్లో కబుర్లు చెప్పి అదికారంలోకి వచ్చిన జగన్.. ఏం చేశారు ? మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. భూములిచ్చిన రైతుల్ని ఘోరంగా మోసం చేశారు. కర్మసిద్దాంతం అనేది ఒకటి ఉంటుంది. రైతుల్ని ఇంతలా మోసం చేసిన వారికి అంత కంటే ఘోరమైన శిక్షలు ఖచ్చితంగా పడతాయి. కాకపోతే సమయం రావాలి. ఇలా..ఓ రాజధాని ఏర్పడి.. ఉపాధి కేంద్రంగా మారే అవకాశం ఉన్న రాజధాని ఉసురును కులం పేరుతో తీసేసి ఆయన ఏం సాధించారు ?. ఎన్నో.. ఎన్నెన్నో సంస్థలు అమరావతిలో పురుడు పోసుకుని ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉండేవి. అన్నింటి భూములు రద్దు చేసి.. అసలు అమరావతిని పక్కన పడేయడం వల్ల ఏం సాధించారో కానీ.. రాష్ట్రాన్ని సర్వనాశనం అయితే చేశారు.మూడు రాజధానులన్నారు.. ఒక్కటంటే.. ఒక్క రాజదానిని అయినా అభివృద్ధి చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో విశాఖలో కబ్జాలు, సెటిల్మెంట్లతో హోరెత్తించారు. ఇప్పుడు అక్కడ జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోసీ అమరావతి కాదు.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కట్టినవి ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి. ఒక్కటంటే ఒక్కటి ఉండదు. గత ప్రభుత్వంలో కట్టిన వంతెనలు.. ఇళ్లకు రంగులేసి ప్రారంభించి కట్టాం చూశారా అని కనుబొమ్మలెగరేస్తే.. జనాల్ని అందరూ.. విచిత్రంగా చూస్తారు తప్ప.. పని మంతుడని అనుకోరు. నాడు నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో పనికి రాని ఇళ్లుపై ఖర్చు పెట్టి పేదల్ని నిర్వీర్యం చేశారు. పరిశ్రమల్ని తరిమికొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక్క దాంట్లోనూ పని తీరు పరంగా కనీస పాస్ మార్కులు రావు. అయినా వై ఏపీ నీడ్స్ జగన్ అనే ప్రచారం చేసకోవాలంటే.. ఎంత సిగ్గులేని తనం ఉండాలి ?
రాష్ట్రాన్నే కాదు.. పేదల్నీ అప్పుల పాలు చేశారు.. ఇక దివాలా తీయించేందుకా.. ఏపీ నీడ్స్ జగన్ !
పేదలకు మేలు చేస్తూంటే వద్దంటున్నారని.. పేదలకు.. పెత్తందారులకు యుద్ధం అంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఉన్నత వర్గాలుకు జగన్ పాలనలో వచ్చిన నష్టమేం లేదు. అసలు నష్టపోయింది అంతా.. మధ్య తరగతి పేద వర్గాలే. మధ్య తరగతి వర్గాలు పేదలుగా మారితే.. పేదలు నిరుపేదలయ్యారు. వారికి పది రూపాయలు ఇస్తూ వారిని వంద రూపాయల రుణ ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఇది ప్రభత్వం ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు కాదు..నేరుగా ప్రజల్ని అప్పుల ఊబిలోకి దింపిన పాలన. ఓటీఎస్ అని..ఇళ్లు అని..ప్రజల్ని అప్పల పాలు చేశారు. మద్యం ధరలు తట్టుకోలేని విధంగా పెంచి ఇళ్లూ, ఒళ్లు గుల్ల చేశారు. వచ్చే పాతికేళ్ల పాటు మళ్లీ ఎవరు వచ్చినా ధరలు తగ్గించకుండా ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. ప్రస్తుతం మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇదంతా ప్రజల దగ్గర పిండుకుందే. ముఖ్యంగా పేద ప్రజల దగ్గర నుంచి పిండుకుందే. ఓ లక్షాధికారి రూపాయికి..రోజుకు ఐదు వందలు సంపాదించుకునే వారి రూపాయికి చాలా తేడా ఉంటుంది. కానీ ఈ పేదవాడి రూపాయినే మద్యం రూపంలో దారుణంగా దోచుకుంది జగన్ ప్రభుత్వం. ఇక అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి.. కరెంట్ చార్జీలు బాదేసి.. బతుకు ఎంత దుర్భరం చేయాలో అంతా చేశారు. ఇక బతకుండా చేయడానికే ఏపీ నీడ్స్ జగన్?
రౌడీయిజం.. గూండాయిజాన్ని శాశ్వతం చేసేందుకా ఏపీ నీడ్స్ జగన్ ?
రాష్ట్రంలో శాంతిభద్రతలు మిధ్య. ఓ ఎంపీని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో … జరుగుతున్న ప్రచారం… సీఎం కుటుంబానికి ప్రకటనల ద్వారా ఆ ఎంపీ కట్టిన కప్పం అన్నీ చూస్తే.. వ్యవస్థీకృత మాఫియాను ఏపీలో నడుపుతున్నారని చెప్పక తప్పదు. ఉచితంగా ఇచ్చే ఇసుకను అత్యంత భారం చేశారు. అసలు ఏపీలో వ్యాపారాలే చేసుకోకుండా ప్రతి రంగాన్ని వేధించారు. సినిమా, నిర్మాణ రంగం, హోటల్స్, విద్యా సంస్థలు.. ఇలా దేన్నీ వదిలి పెట్టలేదు. మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. అగ్రిగోల్డ్ మునిగిపోతే.. ఇదిగో రాగానే డబ్బులిచ్చేస్తానని హామీ ఇచ్చి..మోసం చేశారు. ఇప్పుడు మార్గదర్శి మీద పడి.. ఆ కంపెనీని మూసేయిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. చివరికి సొంత ఎంపీ కూడా స్వరాష్ట్రంలో వ్యాపారం చేయలేనని చెప్పే పరిస్థితి వచ్చింది. ప్రతీ రోజూ.. హత్యలు, అత్యాచారాలు జరుగుతూ..ఏపీలో అంతే అనుకునే పరిస్థితి తీసుకు వచ్చారు. ప్రజలందరూ.. గగ్గోలు పెడుతూ పక్క రాష్ట్రాల కుపరుగులు పెట్టేలా పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన పాలన జరుగుతోందని ఎవరైనా అనుకోగలరా ? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొన్ని వందల సార్లు కొట్టేశాయి. ఇంత కంటే సిగ్గుమాలిన పాలన అందించడానికే ఏపీకి మళ్లీ కావాలా?. రైతుల్ని మోసం చేసి.. ప్రజల్ని మోసం చేసి.. ఉద్యోగుల్ని నట్టేట ముంచి.. ఏం సాధిద్దామని..మళ్లీ ఏపీ నీడ్స్ జగన్ ?
ఇలా చెప్పకుంటూ పోతే.. ఏ రంగంలోనూ జగన్ రెడ్డి చూపించిన ప్రతిభ ఏమీ లేదు. కేసుల కోసం కేంద్రం వద్ద రాజీ పడటం… రాష్ట్రానికి ద్రోహం చేయడం.. ప్రశ్నించేవారిని వేధించడం..చట్టాన్ని చుట్టంగా మార్చుకోవడం. చివరికి సివిల్ సర్వీస్ అధికారుల్ని కూడా ఇంత నీచ స్థాయికి దిగజార్చిన పాలన ..ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వీటిని మరింత అధమ స్థాయికి తీసుకెళ్లడానికా.. ఏపీ నీడ్స్ జగన్ ?
కడుపు నిండా విషం… మనసు నిండా ద్వేషం నింపుకుని.. ఒళ్లంతా అహం అనే అహంకారంతో ఉన్న వారి పాలనతో రాష్ట్రం ఎప్పుడూ ఇంతే ఉంటుంది. కులం, మతం, ప్రాంతం మధ్య చిచ్చు పెట్టేసుకుని ఓట్లు పొందవచ్చని అనుకుంటే.. జనాల్ని తక్కువ అంచనా వేసినట్లే. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నారు తమకు ఎందుకు అవసరం లేదో.. కనీస ఆలోచన ఉన్న వారందరికీ తెలుసు. వారు కూడా తమలో అదే ప్రశ్నించుకుటున్నారు. ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు అంటున్నారు.