వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం పన్నులుగా కట్టిన సొమ్మును ఇస్తూ.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వ్యక్తిని నియమించింది. వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ యాభై ఇళ్ల సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు పంపిస్తోంది. వారి ద్వారా స్థానిక ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ వాలంటీర్లలో 90 శాతం మంది మన వాళ్లేనని విజయసాయిరెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ మనవాళ్లు .. వైసీపీ వాళ్లు కాకుండా పోయారో లేకపోతే.. వారు సరిపోరని డిసైడయ్యారో కానీ.. వైసీపీ తరపున కూడా ప్రతీ యాభై ఇళ్లకు ఓ ప్రతినిధిని పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.
పార్టీ తరపున ఇంచార్జులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా కొత్తగా పరిశీలకుల్ని నియమించారు. గురువారం ఎమ్మెల్యేలు, ఇంచార్జులను పిలువకుండా.. పరిశీలకులు.. రీజనల్ ఇంచార్జులు, జిల్లా అధ్యక్షులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తన పార్టీ వాలంటీర్ ఆలోచన గురించి చెప్పారు. వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు. ఎన్నికల్లో అభ్యర్థుల్ని గెలిపించాలంటే.. ఈ యాభై ఇళ్లకు ఒక వైసీపీ ప్రతినిధి నియామకం తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ఉన్న వాలంటీర్లు చేస్తున్నదే.. పార్టీ వాలంటీర్ చేయాలి. మరి ఇద్దరెందుకన్నది వైసీపీ వర్గాలకూ అర్థం కావడం లేదు.
ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ బాగా పరిపాలిస్తే ప్రజలకు మేలు చేస్తే.. వాళ్లే ఓట్లేస్తారని అనుకునేది. కానీ జగన్ మాత్రం.. గెలిచినప్పటి నుండి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎలా గెలవాలనేదానిపైనే కసరత్తు చేస్తున్నారు. రెండేళ్లు పూర్తయిన దగ్గర్నుంచి ఒకటే హడావుడి పడుతున్నారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి ఇంకా ఇంకా కంగారు పడుతున్నారు. పార్టీ నేతలందర్నీ రోడ్లపైకి పంపుతున్నారు. కొత్త కొత్త వ్యవస్థలతో ప్రయత్నాలు చేస్తున్నారు.