ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఉన్న శాఖ ల్లో ఒక దానికి కత్తెర వేసి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బదలాయించారు. హఠాత్తుగా ఎందుకు బదలాయించారో చాలా మందికి అర్థం కాలేదు. ఏదో ఓ కారణం ఉండకపోతే ఏమీ చేయరు కాబట్టి ఆ కారణం ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. కానీ గత జూలైలో వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకూ రెవెన్యూ శాఖ పరిధిలో ఉండేవి. అయితే ఆ ఉత్తర్వులను ముఖ్యమంత్రితో సంప్రదించకుండా నేరుగా సీఎంవో అధికారి ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారని సీఎం ఆగ్రహించారని వార్తలు వచ్చాయి.
అయితే అలాంటిదేమీ లేదని ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక శాఖా మంత్రికి అప్పగించడంతో అర్థమవుతోందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. పన్నుల రాబడి.. అప్పుల వ్యవహారం..అంతా ఇంటర్లింకింగ్ కార్యాకలాపాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో శాఖల బదిలీలు..మార్పులు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. అందుకే అసలు త్వరలో పునర్వ్యవస్థీకరణలో అసలు పదవే ఉండదని ప్రచారం జరుగుతున్న నారాయణస్వామి శాఖల్లో హఠాత్తుగా కోత వేసినట్లుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆయనకు ఎక్సైజ్ శాఖ ఉంది. కానీ ఆ శాఖ వ్యవహారాలపై ాయన ఎప్పుడూ సమీక్షలు చేసినట్లుగా కూడా ఉండరు. ఆయనే కాదు.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నా.. అదే పరిస్థితి. ఎవరి దగ్గర ఎలాంటి శాఖలు ఉన్నా వారెవరూ పెద్దగా అధికారిక వ్యవహారాల్లో ఉన్నట్లుగా ఎప్పుడూ ఉండరు. అందుకే శాఖల కత్తిరింపును కూడా నారాయణ స్వామి లాంటినేతలు పెద్దగా సీరియస్గా తీసుకునే అవకాశం లేదు.