మద్య నిషేధం అనే హామీ చేసేది లేదని మద్యం ఆదాయాన్ని పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి క్లారిటీ ఇచ్చేసిన ప్రభుత్వం..ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రజలతో తాగించాలని డిసైడయింది. ఇప్పటి వరకూ షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచి.. మద్యం తాగేవాళ్లని తగ్గిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం .. హఠాత్తుగా ఇరవైశాతం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే… ఇతర ప్రాంతాలను నుంచి ఏపీలోకి అక్రమంగా వస్తున్న మద్యాన్ని కట్టడానికి చేయడానికి .. నిర్ణయం విడుదల చేసిన అధికారి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వెల్లువలా వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దుల్లో ఎంత చెకింగ్ పెట్టినా అక్రమ మద్యం ఏపీలోఆపలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఈబీని ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. కానీ మద్యం రాక మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బ్రాండ్లు కూడా లభించవు. అన్నీ ఓన్లీ ఫర్ ఆంధ్ర సేల్ బ్రాండ్లు మాత్రమే ఉంటాయి. ప్రముఖ కంపెనీల బ్రాండ్లు లేకపోవడం కూడా అక్రమ మద్యం విరివిగా ఏపీలోకి రావడానికి కారణం అవుతోంది. ఈ అంశాన్ని కూడా గుర్తించిన ప్రభుత్వం ప్రముఖ కంపెనీల బ్రాండ్లను కూడా అమ్మాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది . ప్రభుత్వ విధానం ప్రకారం చూస్తే.. తాగడం తగ్గించేందుకు రేట్లు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు తాగడాన్ని పెంచేందుకు రేట్లు తగ్గిస్తుందని అనుకోవాలి.