జగన్ రెడ్డి రహస్యాలన్నింటినీ దాచేశానని అనుకుంటున్నారు. కానీ ఆయనకు అసలు గడ్డు పరిస్థితుల్లో అన్నీ బయటకు వస్తాయని ఊహించలేకపోయారు. ఇప్పుడు అది జరగబోతోంది. జగన్ రెడ్డి జనాలకు తెలియకూడదని జీవోలను దాచి పెట్టేశాడు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ జీవోలన్నీ వెలుగులోకి తేవాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28వ తేదీ వరకు గోప్యంగా ఉంచేసిన జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. జీవోఐఆర్ వెబ్ సైట్లో వరుసగా జీవోలను ఉంచుతారు.
ఈ జీవోల్లో చిత్ర విచిత్రాలు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వివాదం అవుతుందనుకున్న ప్రతి జీవోను దాచేశారు. వాటిలో విశాఖ రుషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి జగన్ రెడ్డి వ్యక్తిగత అవసరాల కోసం చేసుకున్న ఖర్చుల వరకూ ప్రతీది ఉంటాయి. అంతేనా సాక్షికి కేటాయించిన నిధుల దగ్గర నుంచి భారతి సీమెంట్స్ కు చేసిన చెల్లింపుల వరకూ అన్నీ ఉంటాయి. అవన్నీ బయటకు వస్తే సోషల్ మీడియాలో వైసీపీకి, జగన్ కు మామూలుగా మ్యూజిక్ ఉండదని టీడీపీ నేతలు ఇప్పటి నుంచే సెటైర్లు వేస్తున్నారు.