ముస్లిం అమ్మాయిల పెళ్లికి చంద్రబాబు దుల్హన్ పథకం రూ. 50వేలు ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక రూ. లక్ష ఇస్తాం. రూ.యాభై వేలు ఏ మూలకైనా సరిపోతాయా ? అని సీఎం జగన్ ముస్లింలకు రంగుల ప్రపంచం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చే రూ.యాభై వేలు కూడా ఇవ్వడం లేదు. ఇస్తామన్న లక్ష ఎప్పడిస్తారో చెప్పడం లేదు. కానీ.. హైకోర్టుకు మాత్రం మా దగ్గర డబ్బు లేదని.. ఆ పథకం ఆపేస్తున్నామని చెప్పారు. అంటే.. వైఎస్ఆర్ కానుకగా ఇస్తామన్న రూ. లక్ష కాదు కదా.. దుల్హన్ కింద ఇస్తున్న రూ. యాభై వేలు కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లయింది.
మేనిఫెస్టోలో పెట్టిన ఈ స్కీమ్ కూడా అమలు చేయలేమని వైసీపీ ప్రభుత్వం నేరుగా కోర్టుకు చెప్పడంతో ముస్లిం సమాజం అవాక్కయింది. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి అందరికీ రుణాలిస్తామన్న హామీ కూడా ఇంత వరకూ నెరవేరలేదు. ముస్లింలకు గతంలో ఉపాధి కోసం ఇచ్చే రుణాలు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. అందరితో పాటు ఇచ్చే అమ్మఒడి, ఇతర పథకాలనే మైనార్టీ కార్పొరేషన్ కింద ఇస్తున్న నిధులుగా చూపిస్తున్నారు. దీంతో ముస్లింల జీవ ప్రమాణాలు పడిపోయే పరిస్థితి వచ్చింది.
మేనిఫెస్టోలో పెట్టిన ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితిలోకి ప్రభుత్వం పడిపోయింది. ప్రమాదవశాత్తూ ఎవరైనా ముస్లిం మరణిస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఎవరికీ సాయం మచేసిన దాఖలాలులేవు. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం మెల్లగా నవరత్నాల విషయంలో చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.