ఒక్క సామాజికవర్గానికే అత్యంత కీలకమైన పదవులు కట్టబెడుతున్నారని తీవ్రమైన విమర్శలు వస్తున్నాఏపీ ప్రభుత్వ పెద్దలకు ఏ మాత్రం వెరపు ఉండటం లేదు. ఇలా కీలకమైన పదవులు ఖాళీ కావడం ఆలస్యం.. అలా తమ వారితో నింపేస్తున్నారు. ఏపీలో ఉద్యోగ నియామకాలన్నీ చూసే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా రమణారెడ్డికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఇప్పటి వరకూ చైర్మన్‌గా ఉన్న ఉదయభాస్కర్ పదవి విరమణ చేశారు.
నిజానికి ఆయన పదవిలో ఉన్నారన్నపేరే కానీ.. వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి కనీస గౌరవం కూడా దక్కలేదు. రమణారెడ్డి లాంటి వారిని ముందుగానే సభ్యులుగా నియమించి వారితోనే నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయ్ భాస్కర్‌తో రాజీనామా చేయించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో.. ఆయన రాజీనామా చేయలేదు. చివరికి… ఎపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలు కోర్టులో కూడా కొట్టివేతకు గురయ్యాయి. అప్పుడు కూడా తతనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఉదయ్ భాస్కర్ కోర్టుకు తెలిపారు.
ఇప్పుడు సొంత వర్గానికి పదవి ఇచ్చుకోవడంతో ఇక నుంచి ఎపీపీఎస్సీలో ఉద్యోగ నియామకాలు ఎలా జరుగుతాయోనన్న సందేహం నిరుద్యోగుల్లో ప్రారంభమయింది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా అత్యంత కీలకమైన పదవులన్నింటిలోనూ ఒకే వర్గంఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా అందులో చేరిపోయింది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ చైర్మన్‌ను గవర్నర్ నియమించాలి. అందుకే ఇంచార్జ్ పదవి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఆయన పేరునే సిఫార్సు చేసి.. నియమించే అవకాశం ఉంది.