ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని హైకోర్టు స్పష్టం చేసింది . ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఏడాదికి రూ . పది నుంచి పద్దెనిమిది వేలకు మించి ఫీజులు వసూలు చేయకూడదని ఏపీ ప్రభుత్వం గత ఆగస్టులో జీవో జారీ చేసింది. పైగా ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజుల్లోనే అన్నీ ఉంటాయి.. అంటే ట్యూషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్ ల్యాబొరేటరీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టడీ టూర్ ఇలా అన్నీ అందులోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని జీవోలో పేర్కొంది. ఏ సౌకర్యాలు లేని స్కూళ్లలో కూడా ఆ ఫీజులు గిట్టుబాటు కావని ఇప్పటి ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నాయని యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టును ఆశ్రయించాయి. టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేమని వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి ఈ ఫీజుల జీవో.. కరోనా కారణంగా అనేక ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. చివరికి హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
ప్రతి ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీల అభిప్రాయాలను తీసుకున్నాకే.. ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ జీవో అచ్చంగా సినిమా టిక్కెట్ల జీవోలాంటిదే. సినిమా టిక్కెట్ల జీవోను కూడా ఇంతే ఏకపక్షంగా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైవేటు వ్యాపారానికి ప్రభుత్వం ధరలు నిర్ణయించడం అనేది … సినిమా విషయానికి వర్తించదన్న వాదన బలంగా ఉంది. ఈ క్రమంలో స్కూల్ ఫీజులును ఖరారు చేస్తూ ఇచ్చిన జీవోను కొట్టి వేయడంతో త్వరలో సినిమా టిక్కెట్ల జీవోకూ అదే పరిస్థితి ఎదురవుతుందన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.