ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై ప్రజల్లో వెల్లడవుతున్న అసంతృప్తి అంతా ఇంతా కాదు. రోడ్లపై నాట్లు వేయడం వంటి కార్యక్రమాలను ప్రజలు చేస్తున్నారు. టీడీపీ నేతలు రోజువారీ ఆందోళనలు చేస్తున్నారు. జనసేన డిజిటల్ ఉద్యమం చేసింది. ఇంత చేస్తున్న ప్రభుత్వం మాత్రం వచ్చే వర్షాకాలానికి డెడ్ లైన్ పెట్టుకుంది. అప్పటిలోపు రోడ్లను బాగు చేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెడ్ లైన్ పెట్టారు. రోడ్లపై సమీక్ష నిర్వహించిన ఆయన అక్టోబరు చివరికల్లా వర్షాలు తగ్గుతాయని.. ఆ తర్వాత పనుల సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి ముదుగా రోడ్లను బాగు చేయాలన్నారు.
మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాల్సిందేనన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు పడ్డాయని రైతులు బాగున్నారు కానీ రోడ్లు పాడయ్యాయని జగన్ సమీక్షలో వ్యాఖ్యానించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా లేకపోవడం వల్లే కొన్ని మీడియా సంస్థలు రోడ్ల గురించి వక్రీకరణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే… నెగెటివ్ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారని అన్నారు. మనం రోడ్లు బాగు చేసిన తర్వాత వాటిపై ప్రయాణించేవారే దీనిని గుర్తిస్తారని చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో ఏడాది వర్షా కాలం వచ్చింది. అయితే ఎప్పుడూ రోడ్లు బాగు చేసే ప్రయత్నాలుచేయలేదు. కానీ వర్షాలు పడటం వల్లే రోడ్లు పాడయ్యాయన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో రోడ్ల కోసం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బకాయిలు ఉండటంతో అవి చెల్లిస్తేనే పనులు చేస్తామని అంటున్నారు. నేరుగా బ్యాంకుల ద్వారా చెల్లిస్తామని చెప్పినావారు ముందుకు రావడం లేదు.