ముఖ్యమంత్రి జగన్ ఎంతో గొప్పగా ప్రకటించిన జిల్లాకో మెడికల్ హబ్ ప్రక్రియ కనీసం టెండర్ల వరకూ చేరలేదు. ఆయన వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష పెట్టిన ప్రతీ సారి మెడికల్ హబ్‌ల గురించి గొప్పగా చెప్పేవారు. ఎవరూ వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదని.. విదేశాల నుంచి ఏపీకే రావాలని ఆయన అంటూ ఉండేవారు. దానికి తగ్గట్లుగా గ్రాఫిక్స్‌లతో కొన్ని గొప్పలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉండేవారు. అయితే ఆ మెడికల్ హబ్‌ల ప్రక్రియకు టెండర్లు పిలిచారు. కనీసం ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. పదమూడు జిల్లాల్లో కర్నూలు జిల్లాలో మాత్రం ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు స్పందించారు. ఆ ఒక్కరు తప్ప… ఆస్పత్రుల నిర్మాణానికి నిర్వహించుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
హెల్త్‌హబ్స్ ద్వారా రాష్ట్రంలో 13 కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ వైద్య సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. టెండర్లకు భారీ స్పందన వచ్చిందని చెప్పింది. టెండర్లలో పాల్గొనడానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్డింగ్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు పాల్గొన్నట్లు ఏపీఐఐసీ అధికారులు గొప్పలు చెప్పారు. ఏఐజీ, అపోలో, కేర్, కిమ్స్, సన్‌షైన్, రెయిన్బో, నారాయణ హృదయాలయ, మణిపాల్ లాంటి ప్రముఖ కార్పొరేట్ వైద్యసంస్థలు పాల్గొన్నాయన్నారు. తీరా చూస్తే ఎవరూ టెండర్లు వేయలేదు.
హెల్త్ హబ్స్ నిబంధనల ప్రకారం కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయిస్తారు. ఇవి కాకుండా..పెట్టబుడి పెట్టి మొత్తం ప్రభుత్వానికే సేవ చేయాలన్నట్లుగా నిబంధనలు ఉన్నాయి. అయితే వీటన్నిటంినీ కార్పొరేట్ వైద్య సంస్థలు స్వాగతించాయని చెప్పుకున్నారు. కానీ అందరూ నమస్కారం చెప్పేశారు. చివరికి.. ఒక్కటే వచ్చింది.వాళ్లు కూడా కడతారో లేదో తెలియదు. దీంతో నిబంధనలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.