చావు బతుకుల్లో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ప్రభుత్వ వైద్యుడి చికిత్సకు రూ. కోటిన్నర అవసరం పడింది. మీడియాలో ఆ డాక్టర్ భార్య రాసిన ఓ లేఖ వైరల్ కావడంతో సీఎం జగన్ స్పందించి.. రూ. కోటి అందించేలా ఏర్పాట్లు చేశారు. అవసరం అయితే మరో రూ. యాభై లక్షలు కూడా ఇస్తామని సీఎంవో నుంచి ఆ వైద్యుడి భార్యకు సమాచారం వెళ్లింది. దీంతో… ఆ వైద్యుడి భార్య..తదుపరి వైద్య ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రకాశం జిల్లా కారంచేడులోని ప్రాథమిక వైద్య కేంద్రంలో నర్తు భాస్కరరావు అనే డాక్టర్ పని చేసేవారు. కోవిడ్ పేషంట్లకు కూడా ఆయన చికిత్స చేశారు. ఆ సమయంలో ఆయనకు కరోనా సోకింది. వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రమై ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్నిచోట్లా వైద్యం చేయించి.. చివరికి హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన భార్యకూడా ప్రభుత్వ వైద్యురాలే. అయినా వారి వద్ద.. చికిత్సకు అవసరమైన సొమ్ము లేదు. ఊపిరి తిత్తులు పూర్తిగా పాడైపోవడంతో… ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందేనని తేల్చారు. దీని కోసం రూ. కోటిన్నర ఖర్చు అవుతుంది. అంత డబ్బు పెట్టలేని వైద్యని కుటుంబం… చివరికి.. సోషల్ మీడియాలో తన బాధను వెళ్లబోసుకున్నారు. బంధువులు వెళ్లిమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. బాలినేని.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం వెంటనే స్పందించి రూ. కోటి మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అవసరం అయితే మరో యాభై లక్షలు కూడా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం స్పందనతో ఆ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక అవసరాలను సమకూర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆపేసింది. ప్రస్తుతం వైద్య చికిత్స కొనసాగుతోంది. వైద్యుల ప్రయత్నాలు ఫలించి.. భాస్కర్ రావు కోలుకుంటే.. ఎంతో భవిష్యత్ ఉన్న ఓ యువ వైద్యుడు.. మరెంతో మంది ప్రాణాలను నిలబెట్టేందుకు… పునర్జన్మ పొందినట్లుగా అవుతుంది. ముఖ్యమంత్రి శరవేగంగా స్పందించి రూ. కోటి విడుదల చేయడంపై… హర్షం వ్యక్తం అవుతోంది.