ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పాస్టర్లు, పూజారులు, మౌజమ్, ఇమామ్లకు రూ. ఐదు వేల సాయం చేయాలని నిర్ణయించింది. ఓ వైపు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి పెద్ద ఎత్తున కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుల దగ్గర్నుంచి చేనేత కుటుంబాల వరకూ.. రోజూ పని చేసుకుంటేనే… పూటగడిచే కుటుంబాలు ఇప్పుడు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి కుటుంబాలకు.. రూ. ఐదు వేలు ఆర్థిక సాయం చేయాలంటూ.. పెద్ద ఎత్తన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు రోజూ ఆందోళనలు చేస్తున్నాయి. పేదలు కూడా ప్రభుత్వం నుంచి అదే ఆశిస్తున్నారు . కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభిస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో కానీ… మత పెద్దలకు మాత్రం సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు లెక్కలు తీసుకుంది. అందరికీ రేపో మాపో.. రూ. ఐదు వేలు చొప్పున పంపిణీ చేయనుంది.
వారికి సాయం విషయంలో ఎవరూ విమర్శించరు కానీ.. పేదలకు చేసిన తర్వాతే ఆలోచించాలనే… విజ్ఞప్తులు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే నెలన్నర రోజులుగా కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి లేదు. నెలవారీగా వారి ఖర్చులు మాత్రం ఆగవు. ఇంటి అద్దెల దగ్గర్నుంచి.. ప్రతీది నెల వచ్చే సరికి వారికి తప్పని సరి ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం రూ. వెయ్యి మాత్రమే సాయం చేసింది. బియ్యం పంపిణీ చేసినప్పటికీ.. అది తివగలిగే బియ్యం కాదు. మళ్లీ బియ్యాన్ని కూడా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం పేదలు ఎదురు చూస్తున్నారు.
అసలు మత పెద్దలకు అంటూ.. ప్రత్యేకంగా గిరి గీసి సాయం చేయడం.. చట్ట విరుద్ధమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మతం ప్రకారం విభజించి ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్ని ఎంపిక చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. కానీ ప్రభుత్వం తాను అనుకున్నది చేయాలనుకుంటుది కాబట్టి..ఏదో ఓ ఖాతాలో వేసి సాయం అందిస్తుంది. ఈ కష్ట కాలంలో ఎవరిని ఆదుకున్నా స్వాగతించాల్సిందే కానీ.. అసలు నిజంగా సాయం అవసరమైన వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం విమర్శలు ఎదుర్కోక తప్పదనే భావన వ్యక్తమవుతోంది.