నమ్మిన వాళ్లను నట్టేట ముంచడంలో .. మాయచేయడంలో జగన్ రెడ్డిని మించిన వారు లేరని మరోసారి స్పష్టమయింది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చంద్రబాబు ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారని తెలియగానే .. సీఎం జగన్ రెడ్డి కూడా అదే రోజు ముస్లిం నేతల్ని పిలిచి సమావేశం పెట్టారు. అందరి మాటలు విన్న తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తామని చెబుతారని అనుకున్నారు. కానీ మీరెవరూ ఆందోళన చెందవద్దని.. మీకు నష్టం చేసే పనులు చేయబోమని.. వారికి చెప్పారు. ఇదంతా సరే యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తారా లేదా అంటే.. మాత్రం ఆయన అడ్డగోలు సమాధానం చెప్పారు.
అసలు యూసీసీ మీద డ్రాఫ్ట్ ఇప్పటికీ రాలేదని జగన్ అన్నారు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చర్చ విపరీతంగా నడుస్తోందన్నారు. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అంటే దేశం మొత్తం తెలిసిన దాన్ని .. చర్చ జరుగుతున్న దాన్ని జగన్ రెడ్డి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అసలు డ్రాఫ్ట్ లో ఏముంటుందో తెలియనప్పుడు ముస్లిం సంఘాలు ఎలా అభిప్రాయాలు చెబుతారనుకున్నారని పిలిచారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.
జగన్ దృష్టిలో కేసీఆర్ అమాయకుడయి ఉండాలని.. ఆయన ముస్లిం నేతలు కలవగానే.. యూసీసీ దేశాన్ని విభజిస్తుందని తీర్మానించేసి.. వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించారని సెటైర్లు వేస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించలేని నిస్సహాయతతో తనకు అండగా ఉంటున్న ముస్లింలకు కూడా మాయ మాటలు చెప్పేందుకే జగన్ రెడ్డి సిద్ధపడుతున్నారు కానీ.. వారు వ్యతిరేకిస్తున్న యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పడం లేదు.