2014 ఎన్నికలలో స్వల్ప ఆధిక్యతతో అధికారం కోల్పోయానని తెలుసుకున్నప్పటి నుండి ప్రతిపక్ష నేత వై యస్ జగన్మోహన్ రెడ్డి లో అసహనం వ్యక్తం అవుతున్నది. తరచూ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తధ్యం అనే మాటలు ఆయన నోటినుండి వెలువడుతున్నాయి. ఎప్పుడైనా అసెంబ్లీ కి ఎన్నికలు జరగవచ్చని, తాను అధికారంలోకి రావడం తధ్యం అనే రీతిలో ఆయన పలు సార్లు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ `వైఫల్యాలు’, `ప్రజా వ్యతిదేక విధానాలు’ పై క్రియాశీలకంగా పోరాటాలు జరుపుతున్న ఆయన ఈ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయని తరచూ అంటూ వస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎక్కువకాలం అధికారంలో కొనసాగలేరని అంటూ జ్యోతిష్యం చెబుతున్నారు.
తాజాగా, నిన్ననే “దైవానుగ్రాహంతో ఎన్నికలు ఒక సంవత్సరం లోపే జరుగవచ్చు” అంటూ అయన ఆశాభవం వ్యక్తం చేసారు. చంద్రబాబు నాయుడు `రాక్షస’ పాలనను అంతం చేయడం కోసం దేవుడికి ప్రార్ధనలు చేయమని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు. మచిలీపట్టణం పోర్ట్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల కారణంగా నిర్వాసితులు అవుతున్న రైతుల కుటుంబాలతో ఆయన కృష్ణా జిల్లాలో మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలోనే అధికారంలోకి రాబోతున్నాననే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఒక వేళ తాను కోరుకొంటున్నట్లు మధ్యంతర ఎన్నికలు రాలేక పోయినా “తెలుగు దేశం ప్రభుత్వం రెండేళ్లకు మించి అధికారమలో ఉండలేదు. మేము 2019లో అధికారంలోకి వస్తున్నాము” అంటూ చెప్పారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడకు వెళ్లినా “తెలుగు దేశం ప్రభుత్వం ను వదిలించు కోవడం కోసం రెండేళ్లు ఆగండి” అంటూ చెబుతున్నారు. పైగా, తాను అధికారంలోకి రాగానే తెలుగు దేశం ప్రభుత్వం తీసుకొంటున్న పలు చర్యలను తిరగదోడతానని కూడా హామీ ఇస్తున్నారు.
అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు రైతుల నుండి భూములు సేకరిస్తున్న సమయంలో అక్కడకు వెళ్లి “మేము అధికారంలోకి రాగానే మీ భూములను తిరిగి ఇచ్చివేస్తాం” అంటూ రైతులకు హామీ ఇచ్చారు. మచిలీపట్నంలో కూడా “గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పోర్ట్ కోసం 5,200 ఎకరాలు మాత్రమే సేకరిస్తాం. తెలుగు దేశం ప్రభుత్వం నిర్ణయించిన 1.05 లక్షల ఎకరాలను సేకరించే ప్రసక్తి లేదు” అని చెప్పారు.
కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి వై వైస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఏర్పాటు చేసినప్పటి నుండి “ముఖ్యమంత్రి పదవి కోసం వేచిఉన్న” నాయకుడిగానే తనను భావించుకొంటూ వస్తున్నారు. 2014 ఎన్నికలలో ఓటమి సంభవించిన ఆరునెలల లోగానే ప్రకాశం జిల్లాలోని ఒక సాధువు చెప్పారని మూడేళ్ళలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూలిపోతుందని కర్నూల్ లో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పారు. అప్పటి నుండి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని, మధ్యాంతర ఎన్నికలు జరుగవచ్చని అంటూనే వస్తున్నారు.