మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని జగన్ పార్టీ కార్యకర్తల్ని కాస్త ధైర్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వారానికి రెండు రోజులు పార్టీ కోసం పని చేస్తూ ఆయన ఎప్పుడైనా మైక్ ముందుకొస్తే చెప్పే మాటల్లో ఈ మూడేళ్లు అనే పదం ఉంటుంది. కనీసం నాలుగున్నరేళ్లు ఉంది కదా.. అని వైసీపీ క్యాడర్ అనుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలాగా..ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం అని అనుకుంటూ జగన్ ఆ మాటలు చెబుతూ ఉంటారు. ఓ ఆరు నెలలు పోయాక రెండేళ్లే అంటారు. ఆయనను సమర్థించేందుకు జమిలీ ఎన్నికల గురించి చెబుతారు వైసీపీ నేతలు.
జమిలీ ఎన్నికలు ముందే వస్తాయని చెబుతున్నారు. కానీ అలాంటి అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. 2029 తర్వాతే జమిలీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. అయితే జగన్ మాత్రం.. బీజేపీ వాళ్లు తనకు మిత్రులని వాళ్లు చెప్పారన్నట్లుగా జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి అవకాశం లేదని నిర్మలా సీతారామన్ తాజాగా తేల్చి చెప్పారు. జమిలీ ఎన్నికలు 2029 తర్వాతే వస్తాయని చెప్పారు. ఇప్పటికి జమిలీ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు..పనులు చూస్తే.. ఆమె చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ ఉండదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికలు వస్తే చాలని వైసీపీ అధినేత అనుకుంటున్నారు. ప్రజల కోసం పోరాడకుండా.. అలా రెస్టు తీసుకున్నా..తర్వాత పిలిచి దండ వేస్తారని అనుకుంటున్నారు. ఆయన ఈ విషయంలో ప్రజల్ని అంత తేలికగా ఎందుకు తీసుకుంటున్నారో కానీ.. పార్టీ కార్యక్రమాలను మాత్రం సాక్షి పత్రికకే పరిమితం చేశారు. టీడీపీపై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చాలు.. తమ పని అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ అలాంటి అవకాశం లేదని స్పష్టతకు వస్తోంది.